రైలు ప్రమాదం: 100 మందికి పైగా మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 100 మందికి పైగా మృతిచెందినట్లు ఆ రాష్ట్ర అదనపు డీజీ దల్జీత్ సింగ్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప‍్రెస్ 14 బోగీలు కాన్పూర్ సమీపంలోని పుక్రాయ వద్ద పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారు జామున ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి.
రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ తెలిపారు. బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
వైఎస్ జగన్ సంతాపం
ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.