హీరోల కంటే మేమేమి తక్కువ: పాట్రికా
హాలీవుడ్ చిత్రసీమలో కూడా మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నారని నటి పాట్రికా అర్క్విటే (46) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. తమకు కూడా నటులతో పాటు సమాన వేతనాలందించాలని ఆమె కోరారు. పాట్రికా అర్క్విటే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బాయ్ హుడ్' చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి అవార్డును దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విడాకులు పొందిన ఓ తల్లిగా ఆమె పోషించిన పాత్ర అద్భుతం. దర్శకుడు రిచర్డ్ లింక్లటర్ ఈ పాత్రను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు పన్నేండేళపాటు చిత్రీకరణ జరుపుకున్న గొప్ప వర్ణనాత్మక చిత్రంలో పాట్రికా అర్క్విటే గొప్ప నటనా ప్రతిభను కనబరిచారు.
ఈ అవార్డు అందుకుంటున్న సందర్భంలో ఆమె మాటలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. చిత్ర పరిశ్రమలో మహిళా హక్కుల గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. హాలీవుడ్లో మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. దీనికి అందరు సమ్మతం తెలిపారు. 'ఓకే జీసస్.. నాకు ఈ అవార్డు అందించిన అకాడమీకి ధన్యవాదాలు. నేను ఈ అవార్డును చిత్ర బృందానికి నాతోపాటు అద్భుతంగా నటించిన ఇతరులకు అంకితం చేస్తున్నాను' అని ఉద్వేగపూరితంగా అన్నారు. పాట్రికా అర్క్విటే ఆస్కార్ నామినేషన్‌కు వరకూ రావటం కూడా ఇదే తొలిసారి.