ఆరోగ్యమైనా, ఆనందమైనా మగాళ్లకే ఎక్కువ!
సర్వే
స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యం, ఆనందం విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నారని ఒక కొత్త సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం... మహిళలతో పోలిస్తే పురుషులు చాలా తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
60 శాతం మంది పురుషులు నెలకు ఒకసారి మాత్రమే ఒత్తిడికి గురవుతున్నారు. 70 శాతం మంది పురుషులు తాము అరుదుగా మాత్రమే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నామనీ, మానసిక స్థితిలో మార్పుకు గురవుతామనీ చెప్పారు. మహిళలో మాత్రం సగం మంది కనీసం నెలకు ఒకసారి డిప్రెషన్ బారిన పడతామని చెప్పారు.
మహిళలతో పోల్చితే తలనొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు పురుషులలో తక్కువగా ఉన్నాయి. మహిళల్లో సగం మందికి పైగా నెలలో చాలాసార్లు ఈ సమస్యలతో బాధపడుతున్నారు.
‘‘మహిళలు ఆరోగ్యస్పృహతో ఉంటారు అనేది ఒక సాధారణ అభిప్రాయం. కానీ, సర్వేను బట్టి చూస్తే, పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయం అర్థమవుతోంది.
నిద్రలేమి, ఆందోళన, మానసిక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్‌కు చెందిన న్యూట్రీషియన్ నిపుణులు పెట్రిక్ హోల్ఫోర్డ్.