రేపటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
– నేడు అంకురార్పణ
– పలు ఆర్జిత సేవలు రద్దు
సాక్షి,తిరుమల:
తిరుమల ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు 14 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.
క్రీ.శ 1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసనాధారాలు ఉన్నాయి. క్రీ.శ 1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేస్తారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఆస్థానం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపంలో వేంచేపు చేసి పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు సోమవారం పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. చివరి రోజు మంగళవారం పూర్ణాహుతితో ముగిస్తారు. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, సహస్రదీపాలంకారణ సేవలు రద్దు చేశారు. అలాగే, 14 నుంచి 16వ తేదీ వరకు ఆయా రోజుల్లో నిర్వహించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు.