pb Acharya
-
'13నాటికి సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు'
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-ఎన్పీఎఫ్లో చీలిక ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ పీబీ ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవాలని సీఎం లీ జిట్సును గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 15న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సూచించారు. కాగా నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా మూడు నెలల కిందటే ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డ కారణంగా వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులుగా మారి లిజియుట్సుకు ఎదురు తిరిగారు. జెలియాంగ్కు మద్దతు పలికారు. దీంతో తనకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఉందని, ప్రస్తుతం తనకు 44మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో లీజియెట్సుకు జూలై 13 వరకు గడువు ఇచ్చినట్లు జెలియాంగ్ తెలిపారు. -
నాగాలాండ్ కొత్త సీఎంగా లీజిత్సు
22న ప్రమాణ స్వీకారం కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్ పీఎఫ్) అధ్యక్షుడు షురోజీలి లీజిత్సు (81) ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం జరిగిన డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసనసభాపక్ష సమావేశంలో లీజిత్సును రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంఎల్ఏలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లీజిత్సును గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. పాత ముఖ్యమంత్రి జెలియాంగ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జెలియాంగ్ ప్రభుత్వం నిర్ణయిచగా, దానిపై అక్కడి గిరిజన జాతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ప్రజలు నిరసన ఉద్యమాలు చేపడుతుండగా జనవరి 31న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. సీఎం తన పదవి నుంచి తప్పుకోవడంతోపాటు కాల్పులకు బాధ్యులను సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో జెలియాంగ్ రాజీనామా చేయక తప్పలేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం నాగాలాండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న లీజిత్సు రాజకీయ ప్రస్థానం సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మొదలైంది. 1969లో కోహిమా జిల్లాలోని ఉత్తర అన్గమి–1 నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన లీజిత్సు నాగాలాండ్ తొలి ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్య, ప్రణాళిక వంటి ఎనిమిది మంత్రిత్వ శాఖలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. 2013 వరకూ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లీజిత్సు అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. -
అసోం గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు!
గువాహటి: హిందుస్థాన్ హిందువుల దేశమని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (ఎన్సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీఆర్ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్‌లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్‌లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. 'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు. -
నాగాలాండ్ గవర్నర్ గా ఆచార్య ప్రమాణ స్వీకారం
కోహిమా: నాగాలాండ్ నూతన గవర్నర్ గా పీ బీ ఆచార్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ల సంఖ్య 19 కు చేరింది. నాగాలాండ్ కు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య.. త్రిపుర గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తలపెట్టిన గవర్నర్ల నియామకం ఎపిసోడ్ తో కొన్ని రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికి స్థానం చలనం కలగగా, మరి కొందరు కొత్తగా గవర్నర్లగా నియమితులైయ్యారు.ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ గా ఉన్న 1995-2000 కాలంలో ఆచార్య పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. 1948 లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆచార్య ఆరు నెలల పాటు జైలు శిక్షకూడా అనుభవించారు. ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వం నిషేధించిన అనంతరం ఆయన ముంబై యూనివర్శిటీ పాలక సభ్యునిగా 30 సంవత్సారాలు పాటు సేవలు అందించారు.తదుపరి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఆచార్యను జూలై 14 న నాగాలాండ్ గవర్నర్ గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు.