'13నాటికి సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు'
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-ఎన్‌పీఎఫ్‌లో చీలిక ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ పీబీ ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవాలని సీఎం లీ జిట్సును గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 15న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సూచించారు.
కాగా నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా మూడు నెలల కిందటే ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేశారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డ కారణంగా వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులుగా మారి లిజియుట్సుకు ఎదురు తిరిగారు. జెలియాంగ్‌కు మద్దతు పలికారు. దీంతో తనకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఉందని, ప్రస్తుతం తనకు 44మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో లీజియెట్సుకు జూలై 13 వరకు గడువు ఇచ్చినట్లు జెలియాంగ్ తెలిపారు.