అవసరం మీది...అవకాశం మాది
ఓలా, ఉబెర్ల ‘పీక్’ చార్జీల దోపిడీ
♦ ఏ సమయంలోనైనా పీక్ పేరిట బాదుడు
♦ అవసరాన్ని బట్టి 2.8 రెట్లు, 3 రెట్లు... ఇంకా ఎక్కువ
♦ 10 కిలోమీటర్ల దూరానికి రూ.500పైన వసూలు
♦ ఎయిర్పోర్టుకెళ్లాలంటే ఒక్కోసారి రూ.1.700 పైనే
♦ రైడ్ టైమ్ చార్జీలంటూ... వాటికీ సర్ వర్తింపు
♦ సిటీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే జేబులు గుల్లే
సాక్షి, బిజినెస్ బ్యూరో : శ్రీనివాస్ బోయిన్‌పల్లిలో ఉంటాడు. ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి. తను ఏ మొబైల్ నుంచి విమానం టికెట్లు బుక్ చేశాడో... అదే మొబైల్ నుంచి ఓలా, ఉబెర్ యాప్‌ల ద్వారా క్యాబ్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు. ఎంతసేపు చూసినా... 2.4 రెట్లు, 2.8 రెట్లు తప్ప కిందికి దిగటం లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పీక్ ఛార్జీలేంటనేది శ్రీనివాస్ సందేహం. చుట్టూ నాలుగైదు క్యాబ్‌లు కనిపిస్తున్నా ఎందుకిలా సర్ చార్జీలు వసూలు చేస్తున్నారనేది అర్థం కాలేదు. రెండు యాప్‌లనూ మార్చి మార్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమయం గడిచిపోతుండటంతో చివరకు బుక్ చేయక తప్పలేదు. బోయిన్పల్లి నుంచి ఎయిర్‌పోర్టుకు అయిన చార్జీలెంతో తెలుసా? అక్షరాలా 1,770 రూపాయలు. నిజానికి విశాఖపట్నానికి తను తీసుకున్న విమాన టికెట్ చార్జీయే రూ.2వేలు. ఒకవేళ నేరుగా రైల్లో వెళితే సెకండ్ ఏసీ టికెట్ కూడా రూ.1,770 కన్నా తక్కువే. మరి అంత డబ్బులు పెట్టి ఎయిర్‌పోర్టుకు వెళ్లటంలో ఏమైనా అర్థం ఉందా?
ఇక్కడ ఇంకొకటి గమనించాలి. తన ప్రయాణం గురించి శ్రీనివాస్‌కు ముందే తెలుసు గనక... ముందురోజే క్యాబ్‌ను అడ్వాన్స్ బుకింగ్ చేయటానికి ప్రయత్నించాడు. ఎంతసేపు ప్రయత్నించినా... ఆ స్లాట్లు అన్నీ బుక్ అయిపోయాయని, ఖాళీల్లేవని సమాచారం. పెపైచ్చు ప్రయాణానికి ముందు నేరుగా బుక్ చేసుకోవచ్చనే సలహా. అదీ పరిస్థితి. క్యాబ్ సంస్థల దోపిడీకి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ‘‘రెండ్రోజుల కిందట బేగంపేట నుంచి క్యాబ్‌లో వెళ్లా. కేవలం 7-8 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.540 చార్జీ అయింది. ఇంత దోపిడీ ఉంటుందని ఊహించలేదు’’ అని ఓ ప్రయాణికురాలు వాపోవడం పరిస్థితికి నిదర్శనం.
అసలు నియంత్రణ ఎందుకుండదు?
ఇదొక బిలియన్ డాలర్ల ప్రశ్న. సిటీలో ప్రయాణించే ఆటోకు మీటర్లుంటాయి. బస్సులకైతే నిర్దిష్ట చార్జీలుంటాయి. రైళ్లకూ ఒకే చార్జీ ఉంటుంది. ఆఖరికి విమానాలకు సైతం... గంట ప్రయాణానికి రూ.2,500 మించకుండా చూస్తామని కేంద్రం చెబుతోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. మరి క్యాబ్ చార్జీలపై నియంత్రణ ఎందుకు లేదు? ఇంతకు ముందు ట్యాక్సీ అంటే మీటర్ తప్పనిసరి. ఆ తరవాత క్యాబ్ సంస్థలు రంగంలోకి దిగాక... కిలోమీటరుకు ఎంత చార్జీ అని చెబితే అంతే వసూలు చేసేవి. సర్జ్ ప్రసక్తే లేదు. మరి ఈ ఓలా, ఉబెర్ మాత్రమే ఎందుకిలా ఇష్టం వచ్చినట్లు చార్జీలు వసూలు చేస్తున్నాయి?
వీటిపై నియంత్రణ ఎందుకుండదు? ఇదిపుడు అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న. ఉబెర్ విదేశీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలున్న ఈ సంస్థకు పుష్కలంగా నిధులున్నాయి. అలాగే ‘ఓలా’లోనూ భారీ విదేశీ పెట్టుబడులున్నాయి. ఈ నిధులతో ఇవి ఎన్ని ఆఫర్లయినా ఇవ్వగలవు. ఎన్ని ఒత్తిళ్లయినా తీసుకురాగలవు. ఇపుడు జరుగుతున్నదీ అదేనని పలు వర్గాలు వాపోతున్నాయి. ‘‘నేను కూడా ఈ సర్ బాదుడుకు బలైనవాణ్ణే. కానీ ఏం చేస్తాం? నియంత్రణ అనేది మా చేతిలో లేదు. ప్రభుత్వం ఏవైనా నిబంధనలు తెస్తే అమలు చేయటం వరకే మా బాధ్యత’’ అని సాక్షాత్తూ ఐజీ స్థాయి పోలీసు అధికారే వాపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ కంపెనీల లాభమెంత?
ఓలా, ఉబెర్ల పని విధానం చూస్తే... ఇవి కేవలం అగ్రిగేటర్లు. అంటే ట్యాక్సీలున్న డ్రైవర్లను తమ సభ్యులుగా చేర్చుకుని... రైడ్ కావాల్సిన కస్టమర్లను టెక్నాలజీ ద్వారా వీరితో కలపటమే ఈ సంస్థల పని. ఇలా చేసినందుకు ఈ సంస్థలు తీసుకుంటున్న కమిషన్ వివిధ పన్నులతో కలిపి 20-25%. అంటే... మీరు క్యాబ్ బుక్ చేసుకుని రూ.300 బిల్లు చెల్లించారనుకోండి. నేరుగా రూ.76.50 ఈ సంస్థల ఖాతాలోకి వెళ్లిపోయాయి. సొత కార్లో, డీజిల్ కొట్టించి డ్రైవింగ్ చేసి మిమ్మల్ని గమ్యానికి చేర్చిన డ్రైవర్‌కు మిగిలేది రూ.223.5. ఈ కమిషన్ బాగా ఎక్కువంటూ డ్రైవర్లు ఎన్ని నిరసనలు చేసినా కంపెనీలు అంగుళం కూడా చలించలేదు.
ఛార్జీల బాదుడు ఇలా..: ఓలానే తీసుకుంటే... మినీ కార్లకు కిలోమీటరుకు రూ.7 మాత్రమే వసూలు చేయాలి. కానీ కనీస చార్జీ రూ.69. దూరం 4 కి.మీ. అంటే మీరు 5 కి.మీ. ప్రయాణించారంటే రూ.76 చెల్లించాలి.
మరి సర్జ్ బాదుడుంటే...?
మీరు బుక్ చేసేటపుడే పీక్ టైమ్ చార్జీలంటూ 2.4 ఎక్స్ అనో... 2.8 ఎక్స్ అనో కనిపిస్తుంది. 2.8 అంటే... అన్ని రెట్లు చెల్లించాలన్న మాట. ఉదాహరణకు ఈ సర్ పై 10 కి.మీ. దూరం ప్రయాణించారనుకోండి. 4 కి.మీ.కు 69 బదులు రూ.193 అవుతుంది. మిగిలిన 6 కిలోమీటర్లకు రూ.118 అవుతుంది. ఇక రైడ్ టైమ్ చార్జీ పేరుతో మీరు ప్రయాణించిన సమయానికి నిమిషానికి రూ.1 చొప్పున వసూలు చేస్తారు. సర్జ్ వల్ల అది కూడా నిమిషానికి రూ.2.80 అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్‌లో 10 కిలోమీటర్లు వెళ్లాలంటే కనీసం గంట. అంటే ఇదో రూ.168. ఈ లెక్కన మొత్తం... రూ.479. కేవలం పది కిలోమీటర్ల ప్రయాణానికి మీరు చెల్లించాల్సిన ఛార్జీ రూ.479. ఇక ట్రాఫిక్‌లో సమయం ఎక్కువ పడితే... అంతే సంగతి.
ఇదీ... ఉబెర్ కథ
♦ 2009 జూన్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో ఏర్పాటైంది
♦ మన దేశంలోని 22కిపైగా నగరాల్లో పనిచేస్తోంది
♦ క్యాబ్‌ను యాప్ ద్వారానే బుక్ చేయాలి
♦ ఇపుడు క్యాష్ చెల్లింపులనూ అంగీకరిస్తున్నారు.
♦ ఇప్పటిదాకా 6 బిలియన్ డాలర్లను సేకరించింది
♦ వీటిలో 1 బిలియన్... ఇండియా కార్యకలాపాలకు
ఏడాదిన్నర చిన్న... ఓలా
♦ 2010 డిసెంబర్లో ముంబైలో ఆరంభమైంది.
♦ దేశంలో 100కు పైగా నగరాల్లో సేవలందిస్తోంది
♦ యాప్ ద్వారా క్యాబ్, ఆటో బుక్ చేయొచ్చు
♦ నగదు చెల్లించొచ్చు. ఓలా వాలెట్ ఉంది.
♦ 700 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించింది
ఈ క్యాబ్‌లు మొబైల్ ఫోన్‌నే మీటర్లా పెట్టుకుని తిరుగుతాయి.
నిజానికి మీటరుండే ఏ వాహనానికైనా కమర్షియల్ లెసైన్సుండాలి. పెపైచ్చు మీటరున్నాక ఇలా రెండున్నర రెట్లు, నాలుగు రెట్లు వసూలు చేయకూడదు. కానీ ఈ క్యాబ్‌లకు అవేమీ పట్టడం లేదు.
మిగతా చోట్ల పరిస్థితేంటి...?
♦ పలు దేశాల్లో ఉబెర్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
♦ దేశ రాజధాని ఢిల్లీలో ఈ యాప్ సంస్థల సర్ చార్జీలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎక్కువ వసూలు చేస్తే తమకు చెప్పాలంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చింది. ఓ 20 రోజులు అమల్లో ఉన్న ఈ నిషేధం... తరువాత ఎందుకనో సడలిపోయింది.
♦ గోవాలోకి అసలు ఉబెర్, ఓలాలను అడుగుపెట్టనిచ్చేది లేదంటూ అక్కడి ట్యాక్సీ యూనియన్లు వ్యతిరేకించటంతో అవి అడుగుపెట్టలేకపోయాయి.
♦ ముంబైలో అడపాదడపా అక్కడి ట్యాక్సీ యూనియన్లు వీటికి వ్యతిరేకంగా సమ్మెలు చేస్తూనే ఉన్నాయి. ఆ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
♦ ఈ సర్ దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనలు తెచ్చింది. కొన్ని దూరాలకు తమ రవాణా విభాగమే చార్జీలను నిర్ణయిస్తుందని... రైడ్ టైమ్ అంటూ, సర్ చార్జీలంటూ, పీక్ టైమ్ అంటూ దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. వీటిని వ్యతిరేకించిన ఓలా, ఉబెర్... తమ వాదన కూడా లిఖితపూర్వకంగా ఇచ్చాయి. తుది ఉత్తర్వులింకా రాలేదు.
♦ మన రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో ఈ సంస్థలు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే వీటి వ్యాపారం బాగా పుంజుకుంది. దాంతో ఆఫర్లన్నీ తగ్గించేసి సర్ బాదుడు మొదలుపెట్టాయి. మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో ఆఫర్లు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి దాకా వీటిపై ఎలాంటి నియంత్రణా లేదు.