పశువులకూ ’108’ తరహా సేవలు
పటాన్చెరు: గ్రామగ్రామాన రైతులఇళ్ల వద్ద పాడి పశువుల సంపద పెరగాలని నీటిపారుదలశాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శుక్రవారం జిల్లా స్థాయి పశుప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పశువుల ప్రాణాలను నిలబెట్టేందుకు అవసరమైన అత్యవసర సేవలందించేందుకు 108 వంటి అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. త్వరలో ఈ అంబులెన్స్ సేవలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
పశువైద్య విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుకు విద్యుత్ సబ్సిడీ: పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇన్సూరెన్స్ పథకాన్ని పశువుల కోసం ప్రవేశపెట్టిందన్నారు. రైతులు ఇన్సూరెన్స్ కోసం రూ.200 ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. రూ. 60 వేల వరకు బీమా సొమ్ము పొందవచ్చని సూచించారు.
పాడిరైతుల అభివృద్ధికి విజయ డెయిరీ పాలసేకరణలో రైతుకు లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తున్నామని, దీంతో మిగతా అన్నిడెయిరీలు రైతులకు అదే ధరను ఇవ్వాల్సి వచ్చిందని దాంతో రైతుకు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.