రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావంతో దెబ్బతిన్న వేరుశనగ పంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పెద్దిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కరువు సహాయక చర్యలు చేపట్టాలనే డిమాండ్తోస్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ 2010 నుంచి వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రుణమాఫీ సక్రమంగా అమలు చేయకుండా ఇన్పుట్æసబ్సిడీ పూర్తిగా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులకు రూ.వందల కోట్లు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా కరువు జిల్లాగా ప్రకటిస్తున్నా జిల్లా రైతులకు ఒరిగిందేమీలేదన్నారు. ఈ సారైనా తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయశాఖ డీడీఏ చంద్రానాయక్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సంఘం నాయకులు కదిరెప్ప, ఆదినారాయణ, హనుమంతరెడ్డి, నారాయణ, మాధవరెడ్డి, నారాయణస్వామి, నాగమ్మ, రామక్క పాల్గొన్నారు.