పెన్‌డ్రైవ్ తెచ్చిన తంటా...
కేరళ: కేరళలో ఓ పెన్‌డ్రైవ్ జనాల చేత పరుగు పెట్టించింది. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన టీవీలో దాదాపు అరగంట సేపు ఒక అశ్లీల వీడియో నిరంతరాయంగా ప్రసారం కావటం కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఉదంతాన్ని డార్క్ ఆరెంజ్ అనే యూజర్ దీన్ని బహిర్గతం చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ నెటిజనుడు అందించిన వివరాల ప్రకారం కేరళలోని వాయంద్ జిల్లాలోని కాల్పెట్టా బస్టాండ్‌లో ఉన్న టీవీలో అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్రసారం కావడం మొదలైంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు, పిల్లలు, కాలేజీ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కంగారు పడిన కొంతమంది టీవీని ఆఫ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే టీవీ స్విచ్ ఉన్న గది తాళం వేసి ఉండటంతో... మరికొంతమంది ఆ టీవీపై గుడ్డ కప్పడానికి ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. చివరికి విసుగొచ్చిన వారు ఒక ఇనుప రాడ్ తీసుకొని పవర్ కేబుల్‌ను పగుల గొట్టారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేబుల్ ఆపరేటర్ మంజూర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పొరపాటున వేరే పెన్‌డ్రైవ్ పెట్టడం వల్ల ఇదంతా జరిగిందని ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, కంప్యూటర్ని స్వాధీనం చేసుకున్నట్లు కెకె అబ్దుల షరీఫ్ తెలిపారు.