నిత్యం ట్రాఫిక్జామే
కల్వర్టు నిర్మాణపనులతో వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే ప్రధానరహదారిపై ఎల్ఆర్పల్లి ప్రాంతం వద్ద కల్వర్టు నిర్మాణపనులు కొనసా...గుతుండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు రెండునెలలుగా ఈ పరిస్థితి ఉంది. గత నెల 5వ తేదీన రహదారులు, భవనాలశాఖ అధికారులు నూతన కల్వర్టు నిర్మాణం కోసం పాత కల్వర్టును తొలగించారు. అయితే సాంకేతిక సమస్యలు, కొందరు ఇళ్ల యజమానులు కోర్టుకెళ్లిన నేపథ్యంలో నూతన నిర్మాణం నిలిచిపోయింది. గత 20 రోజుల క్రితం నిర్మాణ æపనులు చేపట్టినా అవి ఇంకా పూర్తికాలేదు. దీంతో పట్టణంలోకి రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ బస్సులకు రహదారి లేకపోవడంతో అవి డిపోకే పరిమితమయ్యాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 100 పడకల ఆస్పత్రి సైతం కల్వర్టు అవతల ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. 21 రోజుల్లో కల్వర్టు నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిన అధికారులు సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇరుకుగా ఉండే ప్రత్యామ్నాయ రోడ్డులో ప్రతి అరగంటకోమారు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్జామ్ అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.