ఆలయాలకు వెళ్లేకన్నా.. ఆటలాడటం మిన్న
ఉత్సాహవంతులైన యువకులు కొందరు ఓ స్వామీజీ దగ్గరికొచ్చి.. 'అయ్యా.. పుణ్యలోకాల్లో నివసించే దేవుళ్ల సాక్షాత్కారం లభించాలంటే ఏం చెయ్యాలి?' అని అడిగారు. అందుకా స్వామీ ఇలా సమాధానమిచ్చారు..
'దేవుడి గుళ్లో గంటను ఎన్నిసార్లు కొట్టాలి, హారతిని కుడి నుంచి ఎడమకివ్వాలా! లేక ఎడమ నుంచి కుడికివ్వాలా! అనే చిన్న చిన్న విషయాల దగ్గరే మీరు ఆగిపోకూడదు. అవన్నీ పక్కకు నెట్టండి. అసలు ఆలయాలకు వెళ్లడమే మానేసి మైదానాలకు తరలి వెళ్లండి. వెళ్లి ఫుట్ బాల్ ఆడండి. ఉత్సాహంగా బంతిని తన్నండి. శక్తినంతా ఉపయోగించి గోల్ చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఇలాంటి ప్రయత్నాల వల్లే మీకు దైవదర్శనం లభిస్తుంది. బలమే జీవితం. బలమే జీవితం. బలహీనతే మరణం' అంటూ యువకులకు ఉద్బోధిస్తారు.
ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఆయన మరెవరో కాదు స్వామి వివేకానంద అని. ప్రస్తుతం మలేసియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. వికేకానంద బెంగాలీ యువతతో పంచుకున్న విషయాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పెటాలింగ్ జయలోని రామకృష్ణ మఠంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల దాకా భారత్ ఎదుగుదల.. తన విశ్వాసాలపై ఉంచిన నమ్మకాలతోనే సాధ్యమయిందని, ఆ విశ్వాసాలను భారతీయుల మదిలో బలంగా నాటిన వ్యక్తి వికేకానందుడని మోదీ ఉద్ఘాటించారు. వివేకానంద కేవలం ఒక వ్యక్తి కాదని, యావత్ భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, మానవసేవే మాధవ సేవ అనే నినాదమే జీవితాశయంగా బతికిన ఆయన.. ఆనాడే పాశ్చాత్య గడ్డపై ప్రబోధనలు చేశారని కొనియాడారు.
పర్యావరణ పరిరక్షణ గురించి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో భారత్ లేదని, ప్రకృతిని, అందులో నివసించే పశుపక్ష్యాదులను భారతీయులు దైవాలుగా భావిస్తారని గుర్తుచేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మలేసియా వెళ్లిన ప్రధాని మోదీ శనివారం ఆసియాన్ సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.