దీవెన యాత్ర
ప్రాచీనకాలం నుంచి మన దేశంలో యాత్రలంటే తీర్థయాత్రలే! ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో సైతం మన పూర్వీకులు తప్పనిసరిగా తీర్థయాత్రలు చేసేవారు. రవాణా వ్యవస్థ మెరుగుపడిన తర్వాత తీర్థయాత్రలే కాదు, వినోదం కోసం చేసే విహారయాత్రలు, సాహస యాత్రలు కూడా పెరిగాయి. వినోదం కోసం విలాసభరితమైన విహారయాత్రలు ఎన్ని చేసినా, జీవితకాలంలో కనీసం కొన్ని పుణ్యక్షేత్రాలనైనా దర్శించుకోవడం భారతీయుల ఆనవాయితీ. దర్శనీయమైన పుణ్యక్షేత్రాలకు, వివిధ మతాలకు చెందిన చరిత్రాత్మక ప్రార్థన కేంద్రాలకు మన దేశం ఆలవాలం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన దేశంలో జాతీయస్థాయిలో ప్రఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రాలతో తెలుగు రాష్ట్రాల్లోని పేరెన్నిక గల పుణ్యక్షేత్రాల గురించిన విశేషాలు మీకోసం...
తిరుపతి తిరుమల
భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే పవిత్ర క్షేత్రం తిరుమల. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, మకర సంక్రాంతి, ఉగాది తదితర పర్వదినాల్లోనైతే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. తూర్పు కనుమల్లోని శేషాచలం పర్వతశ్రేణులపై ఏడుకొండల మీద వెలసినందున శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తులు ఏడుకొండలస్వామిగా పిలుచుకుంటారు. ఇక్కడి సహజ శిలాతోరణం ఒక భౌగోళిక అద్భుతం. ఇదే కాకుండా, ఆకాశగంగ, పాపవినాశనం జలపాతాలు, శ్రీవారి పాదముద్రలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. తిరుపతి–తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా గోవిందరాజులస్వామి ఆలయం, ఆదివరాహస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాలను ఇవే కాకుండా ఇక్కడి కోదండ రామాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయం, జీవకోన, కపిలతీర్థం వంటి సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్‌లో అరుదైన వృక్షజాతులను, పక్షులను చూడవచ్చు. శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కులో అరుదైన జంతుజాలాన్ని, పక్షులను చూడవచ్చు. తిరుపతికి చేరువలోనే మరికొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.వాటిలో శ్రీకాళహస్తి సుప్రసిద్ధ శైవక్షేత్రం. కాలసర్పదోషం వంటి గ్రహదోషాలకు పరిహారంగా భక్తులు ఇక్కడ ప్రత్యేకపూజలు చేయించుకుంటారు. కాణిపాకంలోని వినాయక ఆలయం, కార్వేటినగరంలోని వేణుగోపాల స్వామి ఆలయం, నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కైలాసనాథస్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం, ముక్కోటిలోని శివాలయం, అప్పలాయగుంటలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, నగలాపురంలో వేదనారాయణస్వామి ఆలయం వంటి చాలా సందర్శనీయ ఆలయాలు ఉన్నాయి. తిరుపతికి చేరువలో విహారయాత్రలకు అనువైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అటవీ సౌందర్యానికి ఆలవాలమైన తలకోన, కళ్యాణి ఆనకట్ట, నారాయణవనంలోని కైలాసకోన, ఆంధ్రా ఊటీగా పేరుపొందిన హార్స్లీ హిల్స్ వంటి ప్రదేశాలు ఆటవిడుపుగా గడపటానికి అనువుగా ఉంటాయి.
వారణాసి
ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిని కాశీ అని కూడా అంటారు. పవిత్ర గంగా తీరంలో ఉన్న కాశీ క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన చాలా పురాణాల్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ నగరం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం వారణాసిలో ఉంది. ఇక్కడ విశ్వేశ్వరాలయంతో పాటు విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయం, కాలభైరవ ఆలయం, సంకటమోచన ఆలయం, వారాహీమాత ఆలయం, దుర్గామాత ఆలయం, కవళీమాత ఆలయం, తులసీ మానసమందిరం వంటి పురాతన ఆలయాలు ఎన్నో సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ గంగానది ఒడ్డున యాత్రికులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా అనేక స్నానఘట్టాలు కనిపిస్తాయి. వీటిలో కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ల ప్రస్తావన పురాణాల్లోనూ కనిపిస్తుంది. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తుంది. వారణాసిలో ముస్లిం పాలకుల హయాంలో నిర్మించిన పురాతన మసీదులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. దశాశ్వమేధఘాట్ సమీపంలోని జంతర్‌మంతర్, గంగాతీరం తూర్పువైపున రామనగర్ కోట, ఈ కోటలో ఉన్న మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
శబరిమల
మన దేశంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న క్షేత్రాలలో శబిరమల ఒకటి. కేరళలోని సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోని శబరిమలపై వెలసిన అయ్యప్పను దర్శించుకునేందుకు దీక్షలు తీసుకున్న భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దట్టమైన అడవులు, పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమైన శబరిమలకు సాగించే యాత్ర అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. శబరిమల యాత్రలో ఏటా నవంబరు 17న జరిగే మండలపూజ, మకరసంక్రాంతి రోజున జరిగే మకరవిళక్కు ప్రధాన ఘట్టాలు. ఈ రెండు రోజుల్లోను, ప్రతి మలయాళ నెలలోనూ ఐదో రోజున అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మిగిలిన అన్ని రోజులూ ఆలయాన్ని మూసి ఉంచుతారు. శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ముందుగా ఎరుమేలిలోని మసీదులో కొలువైన వావరుస్వామిని భక్తులు దర్శించుకుంటారు. దట్టమైన అడవుల గుండా సాగే కాలినడక మార్గంలో అళదానదిలోను, పంపానదిలోను భక్తులు స్నానాలు ఆచరిస్తారు. పచ్చని అడవులు, కొండలు, కోనల మీదుగా సాగే శబరిమల యాత్ర పర్యాటకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉండకపోయినా, మండలపూజ, మకరవిళక్కు సీజన్లో మాత్రం ఇక్కడ విపరీతంగా భక్తుల రద్దీ కనిపిస్తుంది.
షిరీడీ
ఆధ్యాత్మిక ప్రవక్త అయిన సాయిబాబా నివాసం ఉన్న షిరిడీ గడచిన శతాబ్దకాలంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్రలోని షిరిడీ పట్టణం ఇక్కడి సాయిబాబా ఆలయం కారణంగా అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. మన దేశంలో తిరుపతి తర్వాత ఏడాది పొడవునా భక్తులు అత్యధిక సంఖ్యలో సందర్శించుకునే యాత్రా స్థలం షిరిడీనే. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, గురుపూజ వంటి ఉన్నత విలువలను, దేవుడు ఒక్కడేనంటూ మత సామరస్యాన్ని బోధించిన షిరిడీ సాయిబాబాకు దేశ విదేశాల్లో కోట్లాదిగా భక్తులు ఉన్నారు. షిరిడీలో సాయిబాబా అస్తికలను ఉంచిన షిరిడీసాయి ప్రధాన ఆలయంతో పాటు, సాయిబాబా తన జీవితంలో ఎక్కువకాలం గడిపిన ద్వారకామాయి మసీదు, దానికి సమీపంలోని చావిడి, గురుషాన్ వద్దనున్న వేపచెట్టు తదితర ప్రదేశాలను భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడి సాయి హెరిటేజ్ విలేజ్, దీక్షిత్‌వాడా మ్యూజియం, వెట్ ఎన్ జాయ్ వాటర్ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. షిరిడీలోని పురాతన ఖండోబా ఆలయం, షిరిడీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని శింగణాపూర్‌లో ఉన్న శనైశ్చర దేవాలయాలను కూడా భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు.
రామేశ్వరం
ద్వాదశ జ్యోతిరింగ క్షేత్రాల్లో ఒకటైన రామేశ్వరం పురాణకాలం నుంచి ప్రసిద్ధి పొందింది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని రామాయణం చెబుతోంది. బ్రాహ్మణుడైన రావణుడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడు కావడం కోసం రాముడు ఇక్కడ ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రామనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకుని, తీరంలోని సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తి చేసుకున్న ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమిళనాడు రామేశ్వరం ఒక చిన్న దీవి. ప్రధాన భూభాగం నుంచి దీనిని పంబన్ కాలువ వేరు చేస్తోంది. రాముడు ఇక్కడే సేతువు నిర్మించి వానర సైన్యంతో లంకపైకి దండెత్తి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఇక్కడ కనిపించే రామేశ్వర ఆలయాన్ని క్రీస్తుశకం పదో శతాబ్దిలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించాడు. ఈ ఆలయంతో పాటు ఇక్కడ కనిపించే రామపాదాలు, విభీషణాలయం, సేతువు ఉన్న ధనుష్కోటి ప్రాంతం, సువిశాలమైన బీచ్‌లు సందర్శకులకు కనువిందు చేస్తాయి.
సారనాథ్
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరువలో ఉన్న సారనాథ్ నాలుగు ప్రధాన బౌద్ధక్షేత్రాల్లో ఒకటి. బోధిగయలో జ్ఞానోదయం పొందిన ఐదు వారాలకు సారనాథ్ చేరుకున్న గౌతమ బుద్ధుడు ఇక్కడే తన శిష్యులకు మొదటి ‘ధర్మ’ ఉపదేశం చేశాడు. దీనినే ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. ఇక్కడే బుద్ధుని ఐదుగురు శిష్యులతో మొదటి బౌద్ధసంఘం ఏర్పడింది. బుద్ధుని కాలంలో సారనాథ్‌ను ఉసీపట్నం అనేవారు.ఇక్కడి మూలగంధి కుటీరంలో బుద్ధుడు ఐదేళ్లు గడిపాడు. సారనాథ్‌లో బౌద్ధులకు చెందిన అనేక పురాతన చారిత్రక ఆధారాలు నేటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. అశోకుడు స్థాపించిన స్థూపాలు, వాటికపై బుద్ధుని సూక్తులను, అశోకుని శాసనాలను చూడవచ్చు. వీటిలో నాలుగు సింహాలతో కూడిన అశోకస్థూపం మన జాతీయచిహ్నంగాను, ఇందులోని అశోకచక్రం మన జాతీయ జెండాపైన గౌరవం పొందుతున్నాయి. ఇక్కడి చుఖంది స్థూపంలో బుద్ధుని అస్థికలను భద్రపరచారు. సారనాథ్‌లోని జింకల పార్కులోనే బుద్ధుడు తొలి ఉపదేశం చేసిన ప్రదేశాన్ని చూడవచ్చు. శతాబ్దం కిందటి తవ్వకాల్లో బయటపడిన మ్యూజియంలో ఉన్న పురాతన కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వారణాసికి వెళ్లే యాత్రికుల్లో చారిత్రక విశేషాలపై ఆసక్తిగలవారు సారనాథ్‌ను కూడా తప్పక సందర్శించుకుంటూ ఉంటారు.
అజ్మీర్
రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు ముస్లింలతో పాటు ఇతర మతస్తులూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సూఫీ సాధువు మొయినుద్దీన్ చిస్తీ సమాధి చెందిన ఈ దర్గా అజ్మీర్‌లోని తారాగఢ్ కొండ దిగువన ఉంది. ఇక్కడ ప్రార్థనలు జరిపిన తర్వాతే మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు కొడుకు పుట్టాడని ప్రతీతి. అందుకే అక్బర్ తన పట్టమహిషితో కలసి ఈ దర్గాను దర్శించుకోవడానికి ఆగ్రా నుంచి కాలినడకన వచ్చేవాడని చెబుతారు. ఆగ్రా నుంచి అజ్మీర్ దర్గాకు చేరుకునే మార్గంలో ప్రతి రెండు మైళ్లకొకటి చొప్పున నిర్మించిన ‘కోసే మీనార్’ స్తంభాల వద్ద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్బర్ దంపతులు పాదయాత్ర సాగించేవారని చెబుతారు. హైదరాబాద్ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన విరాళంతో అజ్మీర్ దర్గా ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. నిజాం ద్వారం తర్వాత షాజహాన్ నిర్మించిన షాజహానీ దర్వాజా, మహమ్మద్ ఖిల్జీ నిర్మించిన బులంద్ దర్వాజా చూపరులను ఆకట్టుకుంటాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఏటా రజాబ్ నెలలోని ఆరో రోజు లేదా ఏడో రోజున మొయినుద్దీన్ చిస్తీ వర్ధంతి సందర్భంగా ఉర్సు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో లక్షలాదిగా జనం పాల్గొంటారు. కోరికలు తీరాలని ప్రార్థనలు జరిపే భక్తులు కొందరు ఈ దర్గాకు చాదర్లు సమర్పించుకుంటారు. ఇక్కడకు చేరువలోనే మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అక్బరీ మసీదు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆరావళి పర్వతాల నడుమ ఉన్న అజ్మీర్ నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పుష్కర్‌లో అత్యంత అరుదైన బ్రహ్మదేవుని ఆలయం ఉంది. అజ్మీర్‌లోని కొండపై ఎనిమిదో శతాబ్దికి చెందిన ఒకటో అజయరాజా నిర్మించిన ‘అజయమేరు’ కోటనే ఇప్పుడు తారాగఢ్ కోటగా పిలుస్తున్నారు. అజయమేరు కోట ఉన్న నగరం కావడం వల్ల గతంలో దీనిని అజయమేరు నగరంగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరే అజ్మీర్‌గా మారింది. తారాగఢ్ కోటకు చేరువలోని పృథ్వీరాజ్ విగ్రహం, నగరంలోని పురాతన సరోవరాలు, వాటి పరిసరాలు చూపరులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి ‘సోనీజీ కీ నసియాన్’ జైన ఆలయంలోని ప్రధాన మందిరాన్ని ‘స్వర్ణనగరి’ అని అంటారు. వెయ్యి కిలోల బంగారంతో నిర్మించిన ఈ మందిరం చూపరులను ఆకట్టుకుంటుంది. అజ్మీర్‌లో ఒకప్పుడు అక్బర్ కొడుకు సలీం నివసించిన పురాతన భవనంలో ప్రస్తుతం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులోని పురావస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పాత గోవా
ఉత్తర గోవా జిల్లాలోని పాత గోవా ప్రాంతాన్నే పోర్చుగీసు భాషలో ‘వెల్హ గోవా’ అని, ఇంగ్లిష్‌లో ఓల్గోవా అని అంటారు. ఇక్కడి ‘బేసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చిలో పదహారో శతాబ్దికి చెందిన రోమన్ కేథలిక్ క్రైస్తవ మత బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అస్థికలు ఉంటాయి. వీటిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి క్రైస్తవులతో పాటు ఇతర మతాలకు చెందిన పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు.పురాతనమైన ఈ చర్చిని యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఇదే కాకుండా, ఇక్కడ చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అసిసీ, చాపెల్ ఆఫ్ సెయింట్ కేథరీన్, రాయల్ చాపెల్ ఆఫ్ సెయింట్ ఆంథోనీ, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్, చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ వంటి పురాతన చర్చిలు చాలా కనిపిస్తాయి. ఇక్కడి పురాతన చర్చిల్లో ఒకటైన చర్చ్ ఆఫ్ సెయింట్ అగస్టీన్ శిథిలాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తాయి. గోవా సముద్ర తీర సౌందర్యాన్ని తిలకించే పర్యాటకుల్లో చాలామంది ఈ పురాతన చర్చిలను తిలకించడానికి పాత గోవాకు వస్తుంటారు. గోవాలో పోర్చుగీసుల హయాంలో నిర్మించిన చర్చిలు మాత్రమే కాకుండా, శతాబ్దాల నాటి హిందూ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గోవాలోని పన్నెండో శతాబ్ది నాటి మహాదేవ శివాలయం, పదిహేనో శతాబ్దికి చెందిన మహామాయ కాళికా దేవాలయం, ఇక్కడి కవ్లే ప్రాంతంలోని శాంత దుర్గా ఆలయం, అమోనా ప్రాంతంలోని భేతాళ ఆలయం, మషేల్లోని శ్రీ దేవకీ కృష్ణ రవల్నాథ్ ఆలయం వంటి అరుదైన దేవాలయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పండుగ వేళల్లో ఈ ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తుంది.
అమృత్సర్
పంజాబ్‌లోని అమృత్సర్ సిక్కులకు పవిత్రక్షేత్రం. ఇక్కడి స్వర్ణదేవాలయం సిక్కులకు అత్యంత పవిత్ర ప్రార్థన కేంద్రం. స్వర్ణదేవాలయాన్నే ‘హరిమందిర్ సాహిబ్’ అంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శించుకునే ఈ ఆలయానికి సిక్కులతో పాటు ఇతర మతస్తులూ వస్తుంటారు. అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయమే కాకుండా రామాయణ కాలానికి చెందిన మరికొన్ని పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి.ఇక్కడ వాల్మీకి తీర్థస్థల్లో వాల్మీకి ఆశ్రమం ఉంది. వాల్మీకి ఆశ్రమానికి చేరువలోనే ఉన్న ‘రామతీర్థ’ ఆశ్రమంలోనే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చినట్లు ప్రతీతి. అశ్వమేధం చేసిన రాముడు విడిచిన యాగాశ్వాన్ని లవకుశులు బంధించి, దానికి రక్షణగా వచ్చిన హనుమంతుడిని ఒక చెట్టుకు కట్టేశారని పురాణాల కథనం. ఇక్కడి దుర్గయినా ఆలయానికి చేరువలోని చెట్టుకే లవకుశులు హనుమంతుడిని కట్టేశారని చెబతారు. సిక్కుల నాలుగో గురువైన గురు రామదాస్ ఈ నగరాన్ని స్థాపించినందున ఇదివరకు ఈ నగరాన్ని రామదాస్నగర్ అనేవారు. ఇక్కడి గోవింద్గఢ్ కోట, రామ్‌బాగ్ ప్యాలెస్, మహారాజా రంజిత్‌సింగ్ మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి జలియన్‌వాలాబాగ్ నాటి బ్రిటిష్ పాలకుల దాష్టీకానికి నిలువెత్తు సాక్షిగా కనిపిస్తుంది.
పూరీ
ఒడిశాలోని బంగాళాఖాతం తీరంలోనున్న పూరీ శ్రీక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. బలభద్ర, సుభద్రా సమేతుడై జగన్నాథుడు వెలసిన పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని కూడా అంటారు. పూరీలోని జగన్నాథ ఆలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల సువిశాల స్థలంలో నిర్మించిన పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో 120 ఉపాలయాలు, పూజ మందిరాలు ఉన్నాయి.యావత్ భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల ఈ ఆలయంలోనే ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 56 వంటకాలను వండి, ఇక్కడి దేవతామూర్తులకు నివేదిస్తారు. ఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు జరిగే జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు వస్తుంటారు. రథయాత్రలో జగన్నాథ బలభద్ర సుభద్రలు గుండిచా మందిరానికి చేరుకుంటారు. ఆషాఢ శుక్ల దశమి వరకు ఇక్కడ కొలువుదీరే జగన్నాథుడు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. పూరీలోని విమలాదేవి ఆలయంలో ఆశ్వీయుజ మాసం ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు నుంచి విజయదశమి వరకు పదహారు రోజుల పాటు జరిగే పూజలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పూరీ సముద్ర తీరానికి పర్యాటకులు నిత్యం పెద్దసంఖ్యలో వస్తుంటారు. పూరీకి చేరువలోని కోణార్క్ సూర్యదేవాలయం, సాక్షిగోపాల్‌లోని సాక్షిగోపాల ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పూరీకి చేరువలోనే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ ‘ఆలయ నగరం’గా ప్రసిద్ధి పొందింది. పూరీ వచ్చే పర్యాటకుల్లో చాలామంది భువనేశ్వర్‌లోని పురాతన లింగరాజ్ ఆలయం, రాజారాణీ ఆలయం, ఖండగిరి, ఉదయగిరి గుహలు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి.