సాక్షి, విజయవాడ: తీర్ధయాత్ర పేరుతో సుమారు 45మంది యాత్రికుల్ని ఒక ప్రబుద్ధుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చి వదిలివేశాడు. ఉదయం నుంచి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసిన యాత్రికులు సాయంత్రానికి తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. వివరాలు..
10 పుణ్యక్షేత్రాల సందర్శనంటూ.....
విజయవాడ కనకదుర్గ దేవాలయం, భద్రాచలం సీతారామాలయం, బాసర సరస్వతీ దేవాలయం, షిర్డి సాయినాథుడు దేవాలయం తదితర పది ముఖ్యమైన పుణ్య క్షేత్రాలను తొమ్మిది రోజులు పాటు చూపిస్తానంటూ ఎం.శివకుమార్ అనే వ్యక్తి నమ్మించాడు. అన్ని రకాల చార్జీల కింద ఒకొక్కరు రూ.5,500 చెల్లించాలని చెప్పాడు. దీంతో ముగ్గురు పిల్లలతోపాటు 45 మంది యాత్రికులు బయలుదేరారు. గూడూరుకు చెందిన శ్రీనివాస రాము బస్సులో శుక్రవారం రాత్రి గూడూరు నుంచి విజయవాడ తీసుకువచ్చి సీతమ్మవారి పాదాల వద్ద బస్సును ఆపాడు. సాన్నాలు ముగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని రావాలని ఈలోగా తాను టిఫెన్లు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. దీంతో యాత్రికులంతా స్నానాలు చేసి అమ్మవార్ని దర్శించుకుని వచ్చారు. తిరిగి వచ్చే సరికి బస్సు వద్ద కేవలం బస్సు డైవర్, కండక్టర్‌తోపాటు వంట వాళ్లు మాత్రమే ఉన్నారు. శివకుమార్ ఇప్పుడే వస్తానని వెళ్లాడని, ఇంకా తిరిగి రాలేదని చెప్పడంతో మధ్యాహ్నం వరకు వేచిచూశారు. అయితే శివకుమార్ రాకపోవడంతో తమను మోసం చేశాడని భావించి లబోదిబోమన్నారు.యాత్ర ప్రారంభానికి ముందే ప్రతి యాత్రికుని వద్ద రూ.5,500 చొప్పున వసూలు చేశాడు. ఒకరిద్దరు వెయ్యి చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. వారి వద్ద విజయవాడలో తీసుకుని పలాయనం చిత్తగించాడు. అమ్మవార్ని దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు టిఫెన్లు తయారు చేసిపెట్టమని వంటవాళ్లకు సరుకులు కాని సామగ్రి కాని ఇవ్వకపోవడంతో తాము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేశారు.
అతను అడస్సు తెలియదు.
శివకుమార్ గూడూరు, నెల్లూరుల్లో తిరుగుతూ ఉంటాడని, అతనికి భార్యబిడ్డలు, ఇల్లు లేదని, కేవలం కరపత్రాలు ద్వారా యాత్రికుల్ని రాబట్టి యాత్రలు నిర్వహిస్తూ ఉంటాడని బాధితులు చెబుతున్నారు. అతను తమకు ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని అంటున్నారు. తీర్ధయాత్రల పేరుతో బయలుదేరి ఇప్పుడు వెనుక్కు వెళ్లాలంటే మనస్సు ఒప్పడం లేదని, షిర్డీకి టోల్‌గేట్ చార్జీలు సుమారు 15 వేలు అవసరం అవుతాయని వాటిని దాతలు ఎవరైనా ఇస్తే తాము షిర్డీ వెళ్లిపోతామని చెబుతున్నారు. శివ కుమార్ రాకపోవడంతో ఉదయం నుంచి పస్తులే ఉన్నామంటున్నారు. రాము ట్రావెల్స్‌కు ఎంత చెల్లించాడో తమకు తెలియదని, తమ యజమాని చెప్పిన మేరకు బస్సును షిర్డీకి తీసుకువెళుతున్నామని డైవర్, క్లీనర్ తెలిపారు.
నమ్మకంగా చెప్పి మాయ చేశాడు: అరుణ
తొమ్మిది రోజులు యాత్ర గురించి గొప్పగా చెప్పడంతో అందరం బయలు దేరాం. విజయవాడలో బస్సు ఆపి అమ్మవార్ని దర్శించుకుని రమ్మనాడని, దర్శనం చేసుకుని వచ్చేలోగా అందర్నీ వదిలివేసి మాయమయ్యాడు. మా అందరి వద్ద సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు వెనక్కు వెళ్లాలంటే బాధగా వుంది. ఏమీ చేయాలో పాలుపోవడం లేదు.
గతంలో బాగానే తీసుకువెళ్లాడు: రత్నమ్మ
గతంలో ఒకసారి శబరిమలై, మరొకసారి గోదావరి పుష్కరాలకు మమ్మల్ని బాగానే తీసుకువచ్చాడు. ఆ నమ్మకంతోనే రూ.5500 ఇచ్చి షిర్డీ టూర్‌కు బయలుదేరాం. ఈ విధంగా మోసం చేస్తాడని భావించలేదు. అతని ఇంటి అడ్రస్సు తెలియదు. భార్య, పిల్లలూ లేరు. చిన్నచిన్న యాత్రలు చేసి జీవనం సాగిస్తున్నానని మాకు చెప్పాడు.
ఈ విధంగా జరగుతుందని అనుకోలేదు: శంకరయ్య, పాలవ్యాపారి
పది పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతానంటే నమ్మకంతో బయలుదేరామని, ఇంతలోనే ఈ విధంగా మోసం చేస్తాడని అనుకోలేదు. ప్రయాణం మొదట్లో ఆపివేయడంతో ఏమీచేయాలో తెలియడం లేదు. వెనుక్కు వెళ్లాలంటే బాధగా ఉంది. ముందుకు వెళ్లేందుకు కావాల్సిన డబ్బులు మా వద్ద లేదు. ఎవరైనా ఆదుకుంటారేమోనని చూస్తున్నాం.
తీర్ధయాత్రల పేరుతో 45మందిని మోసం చేశాడు!
Published Sat, May 21 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM
Advertisement
Advertisement