Poker Camp
-
పేకాడుతూ పట్టుబడిన తెలుగు తమ్ముళ్లు !
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ఓ పేకాట శిబిరంపై పోలీసులు చేసిన మెరుపుదాడిలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ బాపులపాడు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ సమీపంలోని పామాయిల్ తోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో టీడీపీ నాయకులు, నిర్వాహకులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుతో పాటు గా మేడికొండ రామకృష్ణ, కనకమేడల సుదర్శనరావు, తోట శ్రీరామ్, పత్రివట కృష్ణమోహన్ (గుడివాడ), యల మంచిలి వెంకటేశ్వరరావు, అల్లాడిశెట్టి రాఘవరావు, కనకమేడల వెం కటేశ్వరరావు, యలమంచిలి రవీంద్రకుమార్ పట్టుబడ్డారు. వారి వద్ద రూ.10,500 స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నగదు బదులుగా కాయిన్లతో పేకాట నిర్వహిస్తుండడంతో ఘటనాస్థలంలో దొరికిన కాయిన్ల ఆధారంగా రూ.లక్షల్లోనే పందేలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాయిన్లను స్వాధీనం చేసుకుని ఆ దిశగా విచారణ చేపట్టారు. పోలీసుల వైఖరిపై అనుమానాలు.. టీడీపీ గన్నవరం ఇన్చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రధాన అనుచరులైన అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు పట్టుబడటంతో పోలీసులపై కేసు మాఫీ చేసేందుకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పేకాట శిబిరంపై దాడి చేసి టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు బహిర్గతం చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేకాట శిబిరం వద్ద పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పటికీ కేవలం రూ.10 వేలు మాత్రమే కేసులో చూపించారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు! హనుమాన్‌జంక్షన్ సమీపంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు జంక్షన్ ప్రాంతం నుంచి పలువురిని గోవా, నేపాల్, బ్యాంకాక్, హాంకాంగ్‌కు జూదం ఆడించేందుకు వీళ్లు పలువురిని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ తెలుగు యువత నాయకుడు
నరసరావుపేట రూరల్: పేకాట శిబిరం నిర్వహిస్తూ తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ నరసరావుపేట రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,500ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చినట్టు రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ కొంతకాలంగా పట్టణ శివారు సత్తెనపల్లిరోడ్డు సాయినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ జూద స్థావరం నిర్వహిస్తున్న మారుతీతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా మారుతీ జూదాన్ని వృత్తిగా ఎంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మారుతీ పట్టుబడడంతో అతనిపై నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేటల నుంచి టీడీపీ నాయకులు మారుతీ ఆధ్వర్యంలో నిర్వహించే జూద శిబిరంలో పాల్గొనే వారని సమాచారం. -
పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి (66) పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నర్సింహారెడ్డి గత కొద్దిరోజులుగా తన స్నేహితులతో కలసి న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ప్రాంతంలో ఓ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నర్సింహారెడ్డి (66)తో పాటుగా కౌడి సాయిలు (44), నర్సింహారావు (65), హనుమంతు (58), సుదర్శన్‌రెడ్డి (64), మోహన్‌రెడ్డి (49), భాస్కర్‌రెడ్డి (49), గోవర్ధన్‌రెడ్డి (42), జనార్ధన్‌రెడ్డి (42), శ్రీనివాసరాజు (57), వెంగళ్‌రెడ్డి (43), నర్సిరెడ్డి (64), కృష్ణ (40)లు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి విచారణ నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదును 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
జూద శిబిరాలను ఉపేక్షించేది లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఎక్కడ నడుస్తున్నా ఉపేక్షించేది లేదని.. జూదం ఆడేవారిలో ఎంత పెద్దవాళ్లున్నా వదలి పెట్టేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. జూద శిబిరాల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉంటారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తాను ఆదేశాలిస్తేనే గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేసి.. జూదరులను పట్టుకున్నారని చెప్పారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎంత మాత్రం సహించబోమని అన్నారు. పేకాట క్లబ్బులపైనే ఆధారపడి బతికిన చరిత్ర చంద్రబాబు, దేవినేని ఉమాదేనని మండిపడ్డారు. -
మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం
సాక్షి, కర్నూలు: పేకాట స్థావరాల్లో దొరికిన వారిని కఠినంగా శిక్షస్తామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని, ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులో జరిగిన పేకాట స్థావరాలపై దాడులకు తనకుగాని, తన కుటుంబసభ్యులకుగాని ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించనని ఆయన తెలిపారు. చదవండి: (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) పేకాట స్థావరాలలో దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. మద్యం, పేకాట నిర్మూనలకు తమ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఆలూరు నియోజకవర్గ పరిధిలో హత్య రాజకీయాలు జరిగేవని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి ఫ్యాక్షన్ హత్య కేసులు లేవని మంత్రి జయరాం పేర్కొన్నారు. కాగా కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి తమ దూరపు బంధువు అంటూ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట శిబిరంపై దాడి.. నదిలో దూకి వ్యక్తి మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణా నదిలోకి దూకిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జరిగింది. వివరాలివి.. కొంతమంది వ్యక్తులు కృష్ణా నది సమీపంలో పేకాట అడుతున్నారు. సమాచారం అందుకున్న చల్లపల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. పోలీసులను గమనించిన పేకాటరాయుళ్లు తప్పించుకునే ప్రయత్నాం చేశారు. వారిలో ముగ్గురు పక్కానే ఉన్న కృష్ణా నదిలో దూకారు. ఈ ఘటనలో రామాంజీనేయులు అనే వ్యక్తి నదిలో మునిగి చనిపోయాడు. అతని మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మినీ కాసినో !
సాక్షి, హైదరాబాద్ : పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.. ఎక్కడికక్కడ వాటిని మూసేయించింది.. చిన్నచిన్న లాడ్జిలు, హోటళ్లతోపాటు ఇళ్లల్లో సాగే పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్ గట్టి నిఘా పెడుతోంది.. దీంతో ఇది ఏకంగా స్టార్ హోటళ్లకు పాకుతోంది! పేకాటే కాదు.. ఆ హోటళ్లు ‘మినీ కాసినో’లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌లో అత్యంత పకడ్బందీగా సాగుతున్న పేకాట శిబిరాన్ని పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. పక్కా ఏర్పాట్లు, నిర్వహణ, నిఘా తదితరాలను చూసి పోలీసులే నోళ్లెళ్లబెట్టారు. హోటల్ నిర్వాహకుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ‘క్యాసినో’లతో కూడిన స్టార్ హోటల్స్ నగరంలో మరిన్ని ఉన్నాయని సమాచారం. ఏడో అంతస్తులో పకడ్బబందీగా.. మారియట్ హోటల్ ఏడో అంతస్తులోని 7010 నంబర్ సూట్, 7015, 7025 నంబర్ రూమ్స్‌లో ఈ పేకాట శిబిరం ఏర్పాటైంది. ఈ ఫ్లోర్లో మొత్తం 52 గదులు ఉండగా.. కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. అదీ ‘మినీ క్యాసినో’ఏర్పాటు చేసిన ప్రాంతానికి వేరే వైపు రూమ్స్ మాత్రమే ఇతరులకు కేటాయించారు. అలాగే ఏడో అంతస్తులో లిఫ్ట్ ఆగకుండా చర్యలు తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇతరులెవరూ అటు వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోందని వివరిస్తున్నారు. సూట్ రూమ్‌లో నిర్వాహకులు నగదు లావాదేవీల కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు మొత్తం ఆరు టేబుల్స్ పేకాటరాయుళ్లకు ఏర్పాటు చేశారు. ఒకే రూంలో పదుల సంఖ్యలో.. సాధారణంగా హోటల్స్‌లో సింగిల్ రూమ్‌లో ఒకరు, డబుల్ రూమ్‌లో ఇద్దరు ఉండటానికి మాత్రమే అనుమతిస్తారు. అంతకు మించి మరో వ్యక్తి ఉండాలంటే కచ్చితంగా గెస్ట్ పేరుతో అదనపు చెల్లింపు వసూలు చేస్తారు. ఇలాంటి గెస్ట్ల్ని కూడా ఒకరిద్దరు కంటే ఎక్కువ మందిని అనుమతించరు. కానీ ఈ ‘మినీ క్యాసినో’లో మాత్రం పదుల సంఖ్యలో ఒకే గదిలో ఉండటానికి అనుమతిచ్చారు. పైగా వారికి కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌పై సరఫరా చేశారు. సూట్, రూమ్స్‌లో విదేశీ మద్యం ఏరులై పారుతున్నా.. హుక్కా సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నామని, ఆధారాలు లభిస్తే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. గేటు, లాబీ, లిఫ్ట్ వద్ద నిఘా ఏర్పాట్లు వారాసిగూడ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈ పేకాట శిబిరం ఏర్పాటైంది. నిర్వాహకులు తమ సహాయకులతో పక్కా నిఘా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పాల్గొనడానికి వచ్చే పేకాటరాయుళ్లు దాదాపు పరిచయస్తులే ఉంటారు. కొత్తవారు, పోలీసులు వస్తే గుర్తించి అప్రమత్తం చేసే బాధ్యతల్ని ఈ సహాయకులకు అప్పగించారు. హోటల్ గేటు, లాబీ, లిఫ్ట్, ఏడో అంతస్తులో ఈ నిర్వాహకుల నిఘా ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. తాము కూడా కస్టమర్ల మాదిరి హోటల్లోకి ప్రవేశించామని, అదును చూసుకుని దాడి చేసి పేకాట శిబిరంలో ఉన్న అందరినీ అరెస్టు చేయగలిగామని చెబుతున్నారు. వీరి వద్ద రూ.23.37 లక్షలే దొరికినా.. నిర్వాహకుల ఖాతాల్లో మరో రూ.10 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. రెండు స్వైపింగ్ మిషన్ల ద్వారా జరిగిన లావాదేవీలు తెలిస్తే మొత్తం ఏ మేరకు చేతులు మారిందో తెలుస్తుందని వివరించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఇది రూ.80 లక్షల వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఇలా బయటకు.. అలా జైలుకు మారియట్‌లోని ‘మినీ క్యాసినో’లో చిక్కిన 36 మంది పేకాటరాయుళ్లలో ఒకరైన మోహిత్ జునేజా వారం రోజుల్లో రెండుసార్లు జైలుకు వెళ్లాడు. ఈ రెండు దఫాల్లోనూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకే చిక్కడం గమనార్హం. కవాడిగూడ దేవి కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన మోహిత్ వృత్తి రీత్యా హార్డ్‌వేర్ వ్యాపారి. మహేష్, జితేందర్, కిరణ్ అనే క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు సహాయ బుకీగా వ్యవహరించాడు. రామ్‌గోపాల్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 16న దుబాయ్ కేంద్రంగా పాకిస్తాన్–శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన వెంటనే పేకాట కోసం ‘మినీ క్యాసినో’కు వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున దాడి చేయడంతో మళ్లీ పట్టుబడ్డాడు. నగదు తీసుకొని.. కాయిన్లు.. కౌంటర్లో నగదు తీసుకుని రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేల క్యాసినో కాయిన్లు ఇస్తూ వ్యవస్థీకృతంగా సాగిన ఈ పేకాట వ్యవహారంపై పోలీసులు మొత్తం మూడు చట్టాల కింద కేసు నమోదు చేశారు. పేకాట ఆడించినందుకు గేమింగ్ యాక్ట్‌తో పాటు విదేశీ మద్యం లభించినందుకు ఎక్సైజ్ చట్టం, నిషేధిత హుక్కా సరఫరా జరిగినందుకు టొబాకో ప్రాడక్టŠస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సూత్రధారి సంజయ్ కోసం గాలిస్తున్నట్లు అదనపు డీసీపీ సి.శశిధర్‌రాజు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇతడు నగరంలో ఇలా అనేక హోటళ్లలో వ్యవస్థీకృతంగా పేకాట దందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనేక ‘స్టార్స్’లో ఇదే తంతు ప్రస్తుతం నగరంలో ఉన్న అనేక స్టార్ హోటల్స్‌లో ఇలాంటి ‘క్యాసినో’లే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ, అడుగడుగునా సీసీ కెమెరాలకు తోడు యాక్సస్ కంట్రోల్ వ్యవస్థ నేపథ్యంలో పేకాటరాయుళ్లు స్టార్ హోటళ్లను అడ్డాలుగా మార్చుకుంటున్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు రూ.లక్షలు చెల్లిస్తూ గరిష్టంగా నెలరోజుల పాటు సూట్స్ బుక్ చేసుకుని పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మద్యం, ఆçహార సరఫరా చేస్తూ పేకాటరాయళ్లను ఆకర్షిస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా పెట్టుకోవడం, గతంతో పోలిస్తే ఆక్యుపెన్సీ రేట్ తగ్గడం తదితర పరిణామాలతో హోటల్స్ నిర్వాహకులు సైతం పేకాట శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పేకాట శిబిరంపై దాడి : 12 మంది అరెస్టు
హైదరాబాద్: నగరంలోని ఓ పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. మూసాపేట్ జనతానగర్‌లోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 12 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 సెల్ఫోన్లు, రూ.81,650 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.