సాక్షి, హైదరాబాద్ : పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.. ఎక్కడికక్కడ వాటిని మూసేయించింది.. చిన్నచిన్న లాడ్జిలు, హోటళ్లతోపాటు ఇళ్లల్లో సాగే పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్ గట్టి నిఘా పెడుతోంది.. దీంతో ఇది ఏకంగా స్టార్ హోటళ్లకు పాకుతోంది! పేకాటే కాదు.. ఆ హోటళ్లు ‘మినీ కాసినో’లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌లో అత్యంత పకడ్బందీగా సాగుతున్న పేకాట శిబిరాన్ని పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. పక్కా ఏర్పాట్లు, నిర్వహణ, నిఘా తదితరాలను చూసి పోలీసులే నోళ్లెళ్లబెట్టారు. హోటల్ నిర్వాహకుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ‘క్యాసినో’లతో కూడిన స్టార్ హోటల్స్ నగరంలో మరిన్ని ఉన్నాయని సమాచారం.
ఏడో అంతస్తులో పకడ్బబందీగా..
మారియట్ హోటల్ ఏడో అంతస్తులోని 7010 నంబర్ సూట్, 7015, 7025 నంబర్ రూమ్స్‌లో ఈ పేకాట శిబిరం ఏర్పాటైంది. ఈ ఫ్లోర్‌లో మొత్తం 52 గదులు ఉండగా.. కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. అదీ ‘మినీ క్యాసినో’ఏర్పాటు చేసిన ప్రాంతానికి వేరే వైపు రూమ్స్ మాత్రమే ఇతరులకు కేటాయించారు. అలాగే ఏడో అంతస్తులో లిఫ్ట్ ఆగకుండా చర్యలు తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇతరులెవరూ అటు వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోందని వివరిస్తున్నారు. సూట్ రూమ్‌లో నిర్వాహకులు నగదు లావాదేవీల కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు మొత్తం ఆరు టేబుల్స్ పేకాటరాయుళ్లకు ఏర్పాటు చేశారు.
ఒకే రూంలో పదుల సంఖ్యలో..
సాధారణంగా హోటల్స్‌లో సింగిల్ రూమ్‌లో ఒకరు, డబుల్ రూమ్‌లో ఇద్దరు ఉండటానికి మాత్రమే అనుమతిస్తారు. అంతకు మించి మరో వ్యక్తి ఉండాలంటే కచ్చితంగా గెస్ట్ పేరుతో అదనపు చెల్లింపు వసూలు చేస్తారు. ఇలాంటి గెస్ట్‌ల్ని కూడా ఒకరిద్దరు కంటే ఎక్కువ మందిని అనుమతించరు. కానీ ఈ ‘మినీ క్యాసినో’లో మాత్రం పదుల సంఖ్యలో ఒకే గదిలో ఉండటానికి అనుమతిచ్చారు. పైగా వారికి కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌పై సరఫరా చేశారు. సూట్, రూమ్స్‌లో విదేశీ మద్యం ఏరులై పారుతున్నా.. హుక్కా సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నామని, ఆధారాలు లభిస్తే అరెస్టు చేస్తామని చెబుతున్నారు.
గేటు, లాబీ, లిఫ్ట్ వద్ద నిఘా ఏర్పాట్లు
వారాసిగూడ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈ పేకాట శిబిరం ఏర్పాటైంది. నిర్వాహకులు తమ సహాయకులతో పక్కా నిఘా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పాల్గొనడానికి వచ్చే పేకాటరాయుళ్లు దాదాపు పరిచయస్తులే ఉంటారు. కొత్తవారు, పోలీసులు వస్తే గుర్తించి అప్రమత్తం చేసే బాధ్యతల్ని ఈ సహాయకులకు అప్పగించారు. హోటల్ గేటు, లాబీ, లిఫ్ట్, ఏడో అంతస్తులో ఈ నిర్వాహకుల నిఘా ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. తాము కూడా కస్టమర్ల మాదిరి హోటల్‌లోకి ప్రవేశించామని, అదును చూసుకుని దాడి చేసి పేకాట శిబిరంలో ఉన్న అందరినీ అరెస్టు చేయగలిగామని చెబుతున్నారు. వీరి వద్ద రూ.23.37 లక్షలే దొరికినా.. నిర్వాహకుల ఖాతాల్లో మరో రూ.10 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. రెండు స్వైపింగ్ మిషన్ల ద్వారా జరిగిన లావాదేవీలు తెలిస్తే మొత్తం ఏ మేరకు చేతులు మారిందో తెలుస్తుందని వివరించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఇది రూ.80 లక్షల వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు
ఇలా బయటకు.. అలా జైలుకు
మారియట్‌లోని ‘మినీ క్యాసినో’లో చిక్కిన 36 మంది పేకాటరాయుళ్లలో ఒకరైన మోహిత్ జునేజా వారం రోజుల్లో రెండుసార్లు జైలుకు వెళ్లాడు. ఈ రెండు దఫాల్లోనూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకే చిక్కడం గమనార్హం. కవాడిగూడ దేవి కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన మోహిత్ వృత్తి రీత్యా హార్డ్‌వేర్ వ్యాపారి. మహేష్, జితేందర్, కిరణ్ అనే క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు సహాయ బుకీగా వ్యవహరించాడు. రామ్‌గోపాల్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 16న దుబాయ్ కేంద్రంగా పాకిస్తాన్–శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన వెంటనే పేకాట కోసం ‘మినీ క్యాసినో’కు వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున దాడి చేయడంతో మళ్లీ పట్టుబడ్డాడు.
నగదు తీసుకొని.. కాయిన్లు..
కౌంటర్‌లో నగదు తీసుకుని రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేల క్యాసినో కాయిన్లు ఇస్తూ వ్యవస్థీకృతంగా సాగిన ఈ పేకాట వ్యవహారంపై పోలీసులు మొత్తం మూడు చట్టాల కింద కేసు నమోదు చేశారు. పేకాట ఆడించినందుకు గేమింగ్ యాక్ట్‌తో పాటు విదేశీ మద్యం లభించినందుకు ఎక్సైజ్ చట్టం, నిషేధిత హుక్కా సరఫరా జరిగినందుకు టొబాకో ప్రాడక్టŠస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సూత్రధారి సంజయ్ కోసం గాలిస్తున్నట్లు అదనపు డీసీపీ సి.శశిధర్‌రాజు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇతడు నగరంలో ఇలా అనేక హోటళ్లలో వ్యవస్థీకృతంగా పేకాట దందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనేక ‘స్టార్స్’లో ఇదే తంతు
ప్రస్తుతం నగరంలో ఉన్న అనేక స్టార్ హోటల్స్‌లో ఇలాంటి ‘క్యాసినో’లే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ, అడుగడుగునా సీసీ కెమెరాలకు తోడు యాక్సస్ కంట్రోల్ వ్యవస్థ నేపథ్యంలో పేకాటరాయుళ్లు స్టార్ హోటళ్లను అడ్డాలుగా మార్చుకుంటున్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు రూ.లక్షలు చెల్లిస్తూ గరిష్టంగా నెలరోజుల పాటు సూట్స్ బుక్ చేసుకుని పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మద్యం, ఆçహార సరఫరా చేస్తూ పేకాటరాయళ్లను ఆకర్షిస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా పెట్టుకోవడం, గతంతో పోలిస్తే ఆక్యుపెన్సీ రేట్ తగ్గడం తదితర పరిణామాలతో హోటల్స్ నిర్వాహకులు సైతం పేకాట శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment