గొర్రెలకు బీమా.. పెంపకందారులకు ధీమా
భైంసా రూరల్ : ఈ రైతు పేరు పొల్కం రాములు. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించాడు. చిన్న కొడుకు కిషన్‌ను పదో తరగతి వరకు చదివించి వ్యవసాయ పనులే చేయిస్తున్నారు. ఇద్దరు కొడుకులను చదివించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేస్తూ పైసాపైసా కూడబెట్టి పెద్ద కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించారు. అతను భైంసా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు.
ఈ ఏడాది రాములు తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. మూడుసార్లు విత్తనాలు వేశాడు. సోయా పంట మొలకెత్తినా వేసవిని తలపించే ఎండలతో పంటంతా నాశనమైంది. నమ్ముకున్న వ్యవసాయం అప్పులపాలు చేయడంతో పరిస్థితి ఏమిటని దిగులుపడుతున్నారు. త్రీఫేజ్ కరెంటు సమయానికి రావడం లేదని, ఈ క్రమంలో పంటలు సరిగా పండే అవకాశం లేదని, దీంతో తాను మరింత అప్పులపాలు అయ్యే అవకాశం ఉందని పొల్కం రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ రైతాంగాన్ని ఆదుకుని కరెంటు సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని కోరుతున్నాడు.
ఈ ఏడాది ఖరీదైన ఖరీఫ్
ఖానాపూర్ : మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కాలేరి నర్సయ్యకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. పేద కుటుంబం అయినా రూ.5 లక్షల కట్నంతో కూతురి వివాహం చేశాడు. కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. గతంలో కాకుండా ఈ ఏడాది సాగు అంటేనే అతి ఖరీదుతో కూడుకున్నదైనా ఖాళీగా ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో పంట సాగు చేస్తున్నానని రైతు పేర్కొంటున్నాడు. తనకున్న ఎకరంనర వ్యవసాయ పంట పొలంలో వరి సాగు చేసేందుకు నారు సైతం పోసినా వర్షాలు కురవక, కరెంటు కోతల కారణంగా ఈ ఏడాది నాట్లు వేయడం ఆలస్యమైంది.
గోదావరి పరివాహక ప్రాంతంలో విద్యుత్ ఆధారితంగా సాగు చేస్తున్నానని, గత ప్రభుత్వం ఏడు గంటలు అటు ఇటుగా విద్యుత్ సరఫరా చేసిందని, ప్రస్తుతం అధికారులు ఐదు గంటలు అని చెబుతూనే కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఒక పక్క ఎప్పం దాటిపోవడంతో నారు అదును దాటిపోతుందని, నాటు వేయించాలంటేనే పంట చివరి వరకు కరెంటు సరఫరా ఉంటుందో లేదోననే అనుమానం ఉందని అంటున్నాడు. దీనికి తోడు ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది గోదావరిలో నీరు లేదని పంట చివరి వరకు సరిపోతుందో లేదోనని రైతు తెలిపాడు. గతేడాది విద్యుత్ ఆధారితంగా పంట సాగు చేసినా ఈసారి ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అంతా ఊడిసినట్టయితంది
కడెం : నా పేరు పాక భూమన్న. మాది కడెం మండలంలోని అంబారీపేట. నాకు ఉన్నది 3 ఎకరాల భూమి. దాంట్లకెళ్లి ఒక ఎకరం భూమిల పెసర పంట ఏసిన. మిగతా రెండెకరాల భూమిలో సన్న వడ్లు అలికిన, నారు మొలిసింది, మెల్లగా ఎదుగుతుంది. కానీ మల్ల ఎండ సంపుతుంది కద. అందుకే ఎండిపోయేటట్లుంది. ఉన్న నారు ఎండిపోతే ఎట్ల. మరి కనీసం ఇంటికన్న పనికొస్తయి, ఎట్లయితే అట్లాయే అని ఒక చైనా కంపెనీది మోటారు తెచ్చిన. దానికి రూ.18 వేలు, 40 పైపులకు రూ.24వేలు కర్సయింది.
ఇది రెండు లీటర్ల డీజిల్‌కు ఒక గంట నడుస్తది. కనీసం ఈ వరి నారునైనా కాపాడుకుందామని, అడ్లు ఇంటికి పనికస్తయని కట్టపడుతున్నం. వానల్లేవు. బావిల కూడా ఎక్కువ నీళ్లు లేవు. ఉన్న నీళ్లతోనే ఈ పారకం పారిస్త. ఆ తర్వాత ఆ దేవుడే దిక్కు. ఎకరం పెసర పంట చేను ఎండలకు ఎండిపోతంది. క ండ్ల ముందే ఇట్లయితాంటే చానా బాధనిపిస్తంది. ఈసారి ఎవుసంతో ఏమీ లాభం లేదు. అంతా ఊడిసినట్టయితంది. అంతకుముందువి ఇప్పుడు కలిపి అప్పులు రూ.లక్ష దాకా అయినయి. ఎవుసం నన్నాదుకుంటదనుకుంటే దానికే నేను అప్పు చేసి కర్సుపెడుతున్న. కరెంటు కోతలతో ఇబ్బందులు పడలేకే ఇలా డీజిల్‌తో మోటారు నడుపుకుంటున్న.