postmaster
-
పోస్టాఫీసులో కోటిన్నర స్వాహా
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని సబ్ పోస్టాఫీస్‌లో ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్ పోస్టుమాస్టర్ స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. ఖాతాదారులు, పోస్టల్ డిపార్టుమెంట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ సీఐ బీసన్న బుధవారం తపాలా కార్యాలయానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఖాతాదారులు, డిపాజిటర్లు వారి పాసుబుక్‌లతో పెద్ద సంఖ్యలో వచ్చారు. సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ పోస్టాఫీసు ఖాతాదారులకు డూప్లికేట్ పాసుపుస్తకాలు ఇచ్చి ఖాతాలో వేసిన నగదును ఆ పాసుపుస్తకంలోనే రాసి ఇస్తూ నగదును తన సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఖాతాదారుల ఫోన్ నంబర్లు కూడా మార్చి వేరే నంబర్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఖాతాదారుల అకౌంట్లలోని నగదును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు డిపాజిట్‌దారుల సొమ్మును విత్‌డ్రా చేసినట్లు తేలింది. ఖాతా నంబర్లకు లింకయిన ఫోన్ నంబర్లను ముందస్తుగానే మార్చడంతో నగదు విత్‌డ్రా చేసినప్పుడు వేరేవారికి సమాచారం వెళ్లలేదని విచారణలో తేలింది. పసిగట్టని అధికారులు లక్షల రూపాయలు విత్‌డ్రా అవుతుంటే సంబంధిత ఉన్నతాధికారులు పసిగట్టలేకపోయారు. గతంలో ఒక ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నా.. ఫోన్ చేసి మీరు మీ నగదును విత్‌డ్రా చేసుకున్నారా అని అడిగే వారని, ఇంత నగదు అతి తక్కవ కాలంలో విత్‌డ్రా అవుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే నగదు లెక్కల్లో తేడా వచ్చినట్లు గమనించి 17వ తేదీన రామకృష్ణను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే విచారణ చేసిన పోస్టల్ అధికారులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామకృష్ణ డబ్బులతో పరారవుతుంటే పోస్టల్, పోలీస్ శాఖలు ఏం చేసినట్లని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అనుముల మండలం హజారుగూడెంకు చెందిన సదరు సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ శనివారం నిడమనూరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. -
కుసుమా నువ్వు గ్రేట్
బనశంకరి: ప్రజల్లో డిజిటల్ ఆర్థిక సాధికారత కోసం బెంగుళూరుకు చెందిన ఒక పోస్టుమాస్టర్ చేస్తున్న కృషికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ముగ్ధుల య్యారు. పోస్ట్‌మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను కలిశారు. పోస్ట్మాస్టర్అయిన కుసుమనూ కలిశారు. భారత్‌లో శరవేగంగా సాగుతున్న డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన బిల్‌గేట్స్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
YSR Pension Kanuka: ఒక పోస్ట్‌మాస్టర్ పెన్షన్ కథ!
నాపేరు తబ్బిబ్బు మహానందప్ప. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జన్మించాను. ఆ కాలంలోనే అంటే 1961 లో పీయూసీ చదివి కర్నూల్ మెడికల్ కాలేజీలో 1961–63 సంవత్సరాలలో 3 సంవత్సరాల కాంపౌండర్ కోర్సు, 1965లో హిందీ ప్రవీణ ప్రచారక్ కోర్సులను పూర్తి చేశాను. ఆ తర్వాత 1970లో గ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చూసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడ్డాను. పోస్ట్ మాస్టర్ ఉద్యోగం అదనపు శాఖా ఉద్యోగం (ఈడీ) కావడంతో జీతం చాలా తక్కువ వచ్చేది. ఉద్యోగం ప్రారంభంలో నా జీతం 30 రూపాయలు మాత్రమే. అలవెన్సు కింద మరో 15 రూపాయలు ఇచ్చేవారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 36 ఏళ్ళు పనిచేసి 2006 సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనిదే అయినా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ లేదు. పోస్ట్ మాస్టర్‌గా సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ కంటి తుడుపుగా గ్రాట్యుటీ పేరుతో కేవలం 48 వేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపారు. ఆ డబ్బులు కనీస అవసరాలను కూడా తీర్చలేక పోయాయి. అరకొర జీతంతోనే మా బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సేవలను అందించాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా బ్రాంచ్ ఆదాయం నెలకు రెండువేల రూపాయలు ఉండేది. నేను రిటైర్ అయ్యే నాటికి ఆ ఆదాయం నెలకు 25 వేల రూపాయలకు పెరిగింది. నా జీతం మాత్రం ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందాన పదవీ విరమణ నాటికి 2,800 రూపాయలే. గ్రామీణ ప్రజలకు తపాలా సేవలను అందించడంతోపాటు కాంపౌండర్‌గా శిక్షణ పొంది ఉండటంవల్ల వైద్యసేవలు కూడా అందించాను. పదవీ విరమణ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మాత్రమే కనబడింది. నా జీవన పోరాటంలో భాగంగా మైదుకూరులో నివాసం ఉంటూ ఈ వయసులో కూడా వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలం, గుడిపాడులో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో పార్ట్ టైం హిందీ బోధకుడిగా పనిచేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం అందచేసే ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ కింద గత నెల దాకా 2,500 రూపాయలు అందించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని మరో 250 రూపాయలు పెంచడం ఆనందదాయకం. పెరిగిన మొత్తంతో కలిపి 2,750 రూపాయలు జనవరి 1వ తేదీ కానుకగా అందుకున్నాను. మా వార్డ్ వాలెంటీర్ ‘యాష్మిన్’ అనే అమ్మాయి ప్రతి నెలా ఒకటో తేదీనే మా ఇంటి కొచ్చి ఠంచనుగా పింఛన్ అందచేస్తోంది. ఈ పింఛనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. (క్లిక్ చేయండి: అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం) – టి. మహానందప్ప, రిటైర్డ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మైదుకూరు -
పల్లెటూరు కుర్రాడి... ఖండాంతర ఖ్యాతి
- వీకే రాయపురం నుంచి అమెరికాకు - రూ.2 కోట్ల జీతంతో ఆపిల్ సంస్థలో కొలువు - పోస్టు మాస్టర్ కుమారుడి ప్రతిభ . సమాజంలో కొందరికి ఉన్నట్టే కష్టాలు, కడగండ్లు వెంటాడాయి. ఉన్నత చదువుల ఆశ ఉన్నా ఆర్థిక అవరోధాలు ప్రతిబంధకంగా నిలిచాయి. నిరాశ చెందలేదు ... కలతలను దూరం పెట్టాడు ... కాలంతో పరుగులు తీస్తూ కలలబాట పట్టాడు ... వెళ్లే దారి రైటనుకున్నాడు వెనుతిరిగి చూడలేదు ... గుండెల్లో ధైర్యం నింపుకొని చేతల్లో శౌర్యం చూపిస్తూ... మెదడుకు పదును పెట్టి ప్రతిభకు పట్టం కట్టాడు. ఒక్కో మెట్టు ఎక్కి లోకమంతా మెచ్చేట్టు అనుకున్నది సాధించాడు. ఆయనే మన పోస్టు మాస్టారి కుమారుడు దిలీప్. సామర్లకోట (పెద్దాపురం): మధ్య తరగతి కుటుంబం...తండ్రి పోస్టు మాస్టర్. తల్లి సాధారణ గృహిణి. పక్కా పల్లెటూరులో తల్లిదండ్రుల నివాసం. ప్రాథమిక విద్యాభ్యాసమంతా బోర్డు స్కూల్లోనే. తండ్రి పోస్టుమాస్టర్. అతని తనయుడు ఇప్పుడు ఖండాంతర ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాలో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతిష్టాత్మకమైన యాఫిల్ కంపెనీలో నెలకు రూ.రెండు కోట్లు (బోనస్ ఇతర సదుపాయాలతో కలిపి) జీతంతో ఉద్యోగం సంపాదించి ప్రపంచానికి గ్రామీణ ప్రాంత సత్తాను సాటి జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇంటి దుర్గా లక్ష్మీనారాయణస్వామి (దిలీప్) ఈ ఘనతను అందిపుచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇంటి సూర్యకుమారి, సుబ్బారావు పెద్దగా చదువుకున్న వారు కూడా కాదు. తండ్రి సుబ్బారావు గ్రామంలోనే ఇంటర్ పూర్తి చేసి బ్రాంచి పోస్టు మాస్టరుగా 1988లో రూ.350 జీతంతో ప్రారంభమైన జీవిత పోరాటం అదే బ్రాంచీలో నేటికీ అదే ఉద్యోగం. తల్లి సూర్యకుమారి 10వ తరగతి చదువుకున్నారు. తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిలో రెండు ఎకరాలు అమ్మేసి సుబ్బారావు ఇల్లు కట్టుకున్నారు. బాల్యం నుంచే పరిమళం... వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దిలీప్, రెండో కుమారుడు సుబ్రహ్మణ్య శివప్రసాద్. చిన్నప్పటి నుంచి దిలీప్ చదువుపై ఎంతో ఆసక్తి చూపించేవాడు. అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా ఉంది. ‘పువ్వు పుట్టగానే పరిమళి’స్తుందనే సామెత మాదిరిగా దిలీప్ పదో తరగతి నుంచే మంచి మార్కులు సంపాదిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నతనం నుంచి కవితలు, ఇంగ్లిషులో నాటకాలు ప్రదర్శించేవాడు. సాంస్కృతిక ప్రదర్శనలతో పలు బహుమతులు తన ఖాతాలో వేసుకున్నారీయన. ఉన్నత విద్యలో భాగంగా అమెరికా వర్జీనియా టెక్‌లో ఎంఎస్ విద్యాభ్యాసం పూర్తి చేసి అకడమిక్ బ్యాగ్రౌండ్లో ప్రతిభను చూసి ‘ఆపిల్ సంస్థ«’ ఐఫోన్స్ ఇతర ఉత్పత్తులపై పరిశోధనలకు అత్యధిక జీతం రూ.2,85,00 డాలర్లు (సుమారు రెండు కోట్లు జీతం, బోనస్ ఇతరు సదుపాయాలతో కలిపి) కొలువు కల్పించింది. దిలీప్ ఈ నెల 22న ఆ కంపెనీలో జాయిన్ కానున్నారు. పల్లె మురిసింది... గ్రామీణ నేపథ్యం ఉన్న సాధారణ పాఠశాలల్లో చదివి ఆసాధారణ ప్రతిభ కనబరిచడంతో వీకే రాయపురం పల్లెటూరు పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగుతోంది. వ్యక్తిగత ప్రతిభకు పల్లె వాతావరణ, పేదరికం అడ్డుకాదని దిలీప్ నిరూపించారని గ్రామస్తులు సంబరపడుతున్నారు. ఆ కుర్రాడి పట్టుదలతో గ్రామానికి మంచి పేరు వచ్చిందని స్థానికుల సంతోషానికి అవధుల్లేకుండా ఉంది. విద్యతో సాధించలేనిదేమీ లేదు... విద్యతో సాధించలేనిదంటూ ఏదీ ఉండదని తన కుమారుడు నిరూపించాడు. ఏ తండ్రికైనా ఇంతకు మించి ఏం కావాలి. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివితే ఫలితం ఎలా ఉంటుందో దిలీప్ నిరూపించాడు. ఇతరులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచాడు. తల్లిదండ్రులు పిల్లల చదువును ప్రోత్సహించాలి. దిలీప్ అమెరికాలో స్థిర పడగా, రెండో కుమారుడు సుబ్రహ్మణ్య శివప్రసాద్ చెన్నైలో ఇన్ ఫోసిస్‌లో పని చేస్తున్నాడు. గత ఏడాదికి తమ వివాహమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కుమారుడు రూ.10 లక్షలు విలువైన కారును బహుమతిగా పంపాడు. -
పెళ్లి అని చెప్పినా.. డబ్బివ్వలేదు
మల్కాజిగిరి: ఆయన భాద్యతలు స్వీకరించినపుడు ఎందరికో డబ్బులు వారి ఖాతాల నుంచి సకాలంలో అందజేసి ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి, రద్దు నిర్ణయంతో ఈ రోజు ఆయనే తాను పనిచేసిన శాఖలో.. తన ఖాతాలోని డబ్బులు తీసుకోలేని పరిస్థితి. మరి కొన్ని గంటల్లో కూతురి పెళ్లి ఉన్నా.. చేతిలో డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారాయన. మల్కాజిగిరి సాయిపురికాలనీకి చెందిన సి.విజయ్‌కుమార్ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహించి 2010లో పదవీవిరమణ పొందారు. అప్పుడు వచ్చిన డబ్బులు సుమారు నాలుగున్నర లక్షలను మల్కాజిగిరి పోస్టాఫీస్‌లో ఎంఐఎస్ స్కీమ్‌లో తన కూతురి పేరిట జమచేశారు. 2016 సెప్టెంబర్‌లో స్కీమ్ గడువు ముగియడంతో ఎస్బీ ఖాతా ప్రారంభించి డబ్బులు అందులో జమచేశారు. ఆదివారం కూతురు వివాహం ఉండడంతో మూడు రోజుల క్రితం తనకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని అధికారులను కోరారు. కేవైసీ ప్రతాలతో పాటు పెళ్లి కార్డు జతచేసి ఇవ్వాలని అధికారులు అడిగారు. అయితే, నగదు తక్కువగా ఉందని చెప్పడంతో కనీసం లక్ష రూపాయలైనా సర్దాలని ఆయన కోరారు. శనివారం వస్తే నగదు ఇస్తామని చెప్పిన అధికారులు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా నగదు ఇవ్వలేదని విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవైసీ పత్రాలు కూడా అందజేశానని, డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో వారి పేర్లు కూడా ఇవ్వడానికి అంగీకరించానన్నారు. పైగా తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి బ్యాంక్ ఖాతాలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పడం దారుణమన్నారు. డబ్బులు ఉన్నా కూతురి పెళ్లికి నలుగురి వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళ
న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతికి చెందిన జగ్దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా నియమితులైన తొలి మహిళ జగ్దీప్ గ్రేవాల్ కావడం విశేషం. 537 సిటీ మార్గాలు, 94 రూరల్ ప్రాంతాల్లో విధుల నిర్వహించే 1,004 మంది ఉద్యోగులకు ఆమె నేతృత్వం వహిస్తారు. భారత్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1988లో విండో క్లర్క్‌గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు. ఐదేళ్లలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. తపాల సేవలకు ఆదరణ తగ్గిన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తోటి ఉద్యోగులతో కలిసి మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు. కాగా యూఎస్ తపాల శాఖ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. గతేడాది 586 మిలియన్ డాలర్ల నికర నష్టాలను చవిచూసింది. -
ఉత్తరాల బట్వాడా ఇక వేగవంతం
పోస్ట్ బాక్స్ క్లియరెన్స్‌కు మెయిల్ మోటార్ సర్వీసెస్ ప్రారంభం నగరంలో పదిరూట్లలో 431 పోస్ట్బాక్స్ల ఎంపిక చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ సిటీబ్యూరో: జంటనగరాల్లో ఉత్తరాల బట్వాడా ఇక వేగవంతంగా జరుగుతుందని, పోస్టుబాక్స్‌ల సత్వర క్లియరెన్స్ కోసం మెయిల్ మోటార్ సర్వీస్ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని ఏపీ, టీజీ ఉమ్మడి సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ అన్నారు. బుధవారం అబిడ్స్‌లోని డాక్‌సదన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన మెయిల్ మోటర్ సర్వీస్ వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జంటనగరాల్లోని మొత్తం760 పోస్టు బాక్స్‌లు ఉండగా, అందులో మెయిల్ మోటార్ సర్వీసెస్ ద్వారా మెకనైజ్డ్ క్లియరెన్స్ కోసం 431 పోస్ట్బాక్స్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు మూడు పోస్టల్ డివిజన్లోని పదిరూట్లలో మెయిల్ మోటర్ వాహనాలు తిరుగుతూ పోస్టు బాక్స్‌లను క్లియరెన్స్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం జరుగుతుందని వివరించారు. ప్రతిరోజు ఈ బాక్స్‌లకు 25 వేలకు పైగా ఉత్తరాల తాకిడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఉత్తరాల క్లియరెన్స్‌కు సమయం వృధా కాకుండా సత్వర బట్వాడాకు దోహదపడుతుందన్నారు. నగరంలో సాధ్యమైనంత వరకు రెండుమూడు రోజుల్లో ఉత్తరాల బట్వాడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో స్పీడ్పోస్ట్కు మంచి స్పందన ఉందని తెలిపారు. ఏపీ,టీజీ ఉమ్మడి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు..ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకనెలలో మొత్తం 10.27లక్షల వస్తువులు బుక్ కాగా కేవలం హైదరాబాద్ నగరంలో 5.81 లక్షల వస్తువుల బుకింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ జనరల్ (బీఆడీ) సంధ్యారాణి, డెరైక్టర్ పోస్టల్ అకౌంట్స్ డెరైక్టర్ రాఘవేంద్ర శ్యామ్, మెయిల్ మోటర్ సర్వీసెస్ మేనేజర్ ఆర్షద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.