పెళ్లి అని చెప్పినా.. డబ్బివ్వలేదు
పెళ్లి అని చెప్పినా.. డబ్బివ్వలేదు
Published Sun, Dec 4 2016 3:33 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
మల్కాజిగిరి: ఆయన భాద్యతలు స్వీకరించినపుడు ఎందరికో డబ్బులు వారి ఖాతాల నుంచి సకాలంలో అందజేసి ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి, రద్దు నిర్ణయంతో ఈ రోజు ఆయనే తాను పనిచేసిన శాఖలో.. తన ఖాతాలోని డబ్బులు తీసుకోలేని పరిస్థితి. మరి కొన్ని గంటల్లో కూతురి పెళ్లి ఉన్నా.. చేతిలో డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారాయన. మల్కాజిగిరి సాయిపురికాలనీకి చెందిన సి.విజయ్‌కుమార్ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహించి 2010లో పదవీవిరమణ పొందారు.
అప్పుడు వచ్చిన డబ్బులు సుమారు నాలుగున్నర లక్షలను మల్కాజిగిరి పోస్టాఫీస్‌లో ఎంఐఎస్ స్కీమ్‌లో తన కూతురి పేరిట జమచేశారు. 2016 సెప్టెంబర్‌లో స్కీమ్ గడువు ముగియడంతో ఎస్‌బీ ఖాతా ప్రారంభించి డబ్బులు అందులో జమచేశారు. ఆదివారం కూతురు వివాహం ఉండడంతో మూడు రోజుల క్రితం తనకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని అధికారులను కోరారు. కేవైసీ ప్రతాలతో పాటు పెళ్లి కార్డు జతచేసి ఇవ్వాలని అధికారులు అడిగారు. అయితే, నగదు తక్కువగా ఉందని చెప్పడంతో కనీసం లక్ష రూపాయలైనా సర్దాలని ఆయన కోరారు.
శనివారం వస్తే నగదు ఇస్తామని చెప్పిన అధికారులు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా నగదు ఇవ్వలేదని విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవైసీ పత్రాలు కూడా అందజేశానని, డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో వారి పేర్లు కూడా ఇవ్వడానికి అంగీకరించానన్నారు. పైగా తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి బ్యాంక్ ఖాతాలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పడం దారుణమన్నారు. డబ్బులు ఉన్నా కూతురి పెళ్లికి నలుగురి వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement