పల్లెటూరు కుర్రాడి... ఖండాంతర ఖ్యాతి
పల్లెటూరు కుర్రాడి... ఖండాంతర ఖ్యాతి
Published Thu, May 18 2017 11:40 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
- వీకే రాయపురం నుంచి అమెరికాకు
- రూ.2 కోట్ల జీతంతో ఆపిల్ సంస్థలో కొలువు
- పోస్టు మాస్టర్ కుమారుడి ప్రతిభ
.
సమాజంలో కొందరికి ఉన్నట్టే కష్టాలు, కడగండ్లు వెంటాడాయి. ఉన్నత చదువుల ఆశ ఉన్నా ఆర్థిక అవరోధాలు ప్రతిబంధకంగా నిలిచాయి. నిరాశ చెందలేదు ... కలతలను దూరం పెట్టాడు ... కాలంతో పరుగులు తీస్తూ కలలబాట పట్టాడు ... వెళ్లే దారి రైటనుకున్నాడు వెనుతిరిగి చూడలేదు ... గుండెల్లో ధైర్యం నింపుకొని చేతల్లో శౌర్యం చూపిస్తూ... మెదడుకు పదును పెట్టి ప్రతిభకు పట్టం కట్టాడు. ఒక్కో మెట్టు ఎక్కి లోకమంతా మెచ్చేట్టు అనుకున్నది సాధించాడు. ఆయనే మన పోస్టు మాస్టారి కుమారుడు దిలీప్.
సామర్లకోట (పెద్దాపురం): మధ్య తరగతి కుటుంబం...తండ్రి పోస్టు మాస్టర్. తల్లి సాధారణ గృహిణి. పక్కా పల్లెటూరులో తల్లిదండ్రుల నివాసం. ప్రాథమిక విద్యాభ్యాసమంతా బోర్డు స్కూల్‌లోనే. తండ్రి పోస్టుమాస్టర్. అతని తనయుడు ఇప్పుడు ఖండాంతర ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాలో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతిష్టాత్మకమైన యాఫిల్ కంపెనీలో నెలకు రూ.రెండు కోట్లు (బోనస్ ఇతర సదుపాయాలతో కలిపి) జీతంతో ఉద్యోగం సంపాదించి ప్రపంచానికి గ్రామీణ ప్రాంత సత్తాను సాటి జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇంటి దుర్గా లక్ష్మీనారాయణస్వామి (దిలీప్) ఈ ఘనతను అందిపుచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇంటి సూర్యకుమారి, సుబ్బారావు పెద్దగా చదువుకున్న వారు కూడా కాదు. తండ్రి సుబ్బారావు గ్రామంలోనే ఇంటర్ పూర్తి చేసి బ్రాంచి పోస్టు మాస్టరుగా 1988లో రూ.350 జీతంతో ప్రారంభమైన జీవిత పోరాటం అదే బ్రాంచీలో నేటికీ అదే ఉద్యోగం. తల్లి సూర్యకుమారి 10వ తరగతి చదువుకున్నారు. తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిలో రెండు ఎకరాలు అమ్మేసి సుబ్బారావు ఇల్లు కట్టుకున్నారు.
బాల్యం నుంచే పరిమళం...
వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దిలీప్, రెండో కుమారుడు సుబ్రహ్మణ్య శివప్రసాద్. చిన్నప్పటి నుంచి దిలీప్ చదువుపై ఎంతో ఆసక్తి చూపించేవాడు. అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా ఉంది. ‘పువ్వు పుట్టగానే పరిమళి’స్తుందనే సామెత మాదిరిగా దిలీప్ పదో తరగతి నుంచే మంచి మార్కులు సంపాదిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నతనం నుంచి కవితలు, ఇంగ్లిషులో నాటకాలు ప్రదర్శించేవాడు. సాంస్కృతిక ప్రదర్శనలతో పలు బహుమతులు తన ఖాతాలో వేసుకున్నారీయన. ఉన్నత విద్యలో భాగంగా అమెరికా వర్జీనియా టెక్‌లో ఎంఎస్ విద్యాభ్యాసం పూర్తి చేసి అకడమిక్ బ్యాగ్రౌండ్‌లో ప్రతిభను చూసి ‘ఆపిల్ సంస్థ«’ ఐఫోన్స్ ఇతర ఉత్పత్తులపై పరిశోధనలకు అత్యధిక జీతం రూ.2,85,00 డాలర్లు (సుమారు రెండు కోట్లు జీతం, బోనస్ ఇతరు సదుపాయాలతో కలిపి) కొలువు కల్పించింది. దిలీప్ ఈ నెల 22న ఆ కంపెనీలో జాయిన్ కానున్నారు.
పల్లె మురిసింది...
గ్రామీణ నేపథ్యం ఉన్న సాధారణ పాఠశాలల్లో చదివి ఆసాధారణ ప్రతిభ కనబరిచడంతో వీకే రాయపురం పల్లెటూరు పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగుతోంది. వ్యక్తిగత ప్రతిభకు పల్లె వాతావరణ, పేదరికం అడ్డుకాదని దిలీప్ నిరూపించారని గ్రామస్తులు సంబరపడుతున్నారు. ఆ కుర్రాడి పట్టుదలతో గ్రామానికి మంచి పేరు వచ్చిందని స్థానికుల సంతోషానికి అవధుల్లేకుండా ఉంది.
విద్యతో సాధించలేనిదేమీ లేదు...
విద్యతో సాధించలేనిదంటూ ఏదీ ఉండదని తన కుమారుడు నిరూపించాడు. ఏ తండ్రికైనా ఇంతకు మించి ఏం కావాలి. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివితే ఫలితం ఎలా ఉంటుందో దిలీప్ నిరూపించాడు. ఇతరులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచాడు. తల్లిదండ్రులు పిల్లల చదువును ప్రోత్సహించాలి. దిలీప్ అమెరికాలో స్థిర పడగా, రెండో కుమారుడు సుబ్రహ్మణ్య శివప్రసాద్ చెన్నైలో ఇన్ ఫోసిస్‌లో పని చేస్తున్నాడు. గత ఏడాదికి తమ వివాహమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కుమారుడు రూ.10 లక్షలు విలువైన కారును బహుమతిగా పంపాడు.
Advertisement
Advertisement