Poultry forms
-
కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ
సాక్షి, హైదరాబాద్ : పౌల్ట్రీఫారమ్‌లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పనిచేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఏర్పాటైంది. హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్‌ఈఎంఎక్స్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్ట్ గురువారం ప్రారంభమైంది. భారతదేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓఎల్) ఈడీ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కన దీనిని ఏర్పాటుచేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చౌకైన రవాణా పథకం కింద సోలికా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను అత్తాపూర్‌లోని ఐఓఎల్ ఔట్‌లెట్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సోలికా ప్రమోటర్ హిమదీప్ నల్లవడ్ల తెలిపారు. -
పౌల్ట్రీకి వడదెబ్బ
తూర్పుగోదావరి, మండపేట: మండుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులు తాళలేక కోళ్లు కళ్లు తేలేస్తున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్లు ఉత్పత్తి పడిపోయింది. గడిచిన ఐదు రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ. 58.97 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అంచనా. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 400 వరకు పౌల్ట్రీలు ఉండగా, వివిధ దశల్లో సుమారు 2.8 కోట్లు కోళ్లున్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్లున్నాయి. రోజుకు సాధారణంగానే 0.05 శాతం ఉండే కోళ్ల మరణాలు ప్రస్తుత ఎండలతో రెండు శాతానికి పెరిగాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. గత ఐదు రోజులుగా 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది మరణాలు పెరిగాయని కోళ్ల రైతులు అంటున్నారు. రోజుకు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున సుమారు రూ. 200 మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ మేరకు గత ఐదు రోజుల వ్యవధిలో కోళ్ల మరణాలు రూపంలో జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు రూ.56 కోట్లు మేర నష్టం వాటిల్లింది. మరోపక్క ఎండల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షలు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ. 3.6 పైసలుండగా రోజుకు రూ. దాదాపు రూ. 59.4 లక్షలు చొప్పున గత ఐదు రోజుల్లో రూ.2.97 కోట్లు మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. కోళ్ల మరణాలు, గుడ్లు ఉత్పత్తి పడిపోవడం ద్వారా గత ఐదు రోజుల్లో రూ. 58.97 కోట్లు మేర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఈ నెల 12వ తేదీ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్సీ, నూకల ధరలు గత నెల రోజుల వ్యవధిలో 40 నుంచి 60 శాతం మేర పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను అధిక ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసి మోపెడవుతున్న నిర్వహణ భారం అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లుతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. పాత నిల్వలనుకోళ్ల రైతులకు ఇవ్వాలి ప్రస్తుత ఎండలు పౌల్ట్రీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. సివిల్ సప్లై ఎఫ్‌సీఐ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు అందజేయాలి. ఈ విషయమై రాష్ట్ర అసోసియేషన్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.– పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు, మండపేట మండలం. -
గుడ్లు తేలేస్తున్నయ్
- వారంలో 40 లక్షల కోళ్లు మృతి - చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు విలవిలలాడుతున్నాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలుండగా వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్ కోళ్లు, 2 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి జాగ్రత్తలతో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పైగా బయట ఉష్ణోగ్రతలకు మించి కోళ్ల ఫారాల్లో రేకుల షెడ్డుల కారణంగా మరో రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలుంటాయి. ఇంత భారీ వే డి కారణంగా గత వారం రోజుల్లో దాదాపు 40 లక్షల కోళ్లు మృతిచెందాయి. దీంతో కోళ్ల వ్యాపారులకు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. వాటికి బీమా సౌకర్యం లేకపోవడంతో నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి వస్తోందన్నారు. మరోవైపు లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో చికెన్, గుడ్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు చెప్పాయి. -
కోడి రెట్టతో బయోగ్యాస్ తయార్ !
పౌల్ట్రీ వ్యర్థాలతో బయోగ్యాస్ తయార్ సాక్షి, హైదరాబాద్: కాసేపు కోళ్ల ఫారాల వద్దకెళితే చాలు... ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం స్వాగతం పలుకుతుంది. కోళ్ల రెట్టతో చెడు వాసనొక్కటే సమస్యకాదు... వ్యర్థాలను నిర్మూలించకుంటే నీటి కాలుష్యం తోపాటు అనేక ఇతర సమస్యలూ ముసురుకుంటాయి. మరి ఈ చిక్కులకు పరిష్కారం? ఆ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడమే అంటోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ). ఇందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి ఆహూజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఓ నమూనా ప్లాంట్‌ను కూడా సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ నమూనా ప్లాంట్‌ను పౌల్ట్రీ రైతులు, టెక్నాలజిస్టులు, బ్యాంకు అధికారుల కోసం గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ దేశంలో పౌల్ట్రీ రంగం ఏటా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యర్థాల సమర్థ నిర్వహణ కీలకమవుతోందని చెప్పారు. ఈ అవసరాన్ని గుర్తించి ఐఐసీటీ ఈ సరికొత్త బయోగ్యాస్ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని తెలిపారు. పౌల్ట్రీ వ్యర్థాలకు నీరుతోపాటు ఒక రకమైన బ్యాక్టీరియాను జోడించి, ఆక్సిజన్ లేని వాతావరణం లో కుళ్లబెడితే మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుందని లక్ష్మీకాంతం వివరించారు. పౌల్ట్రీ వ్యర్థాల నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి చేయగలగడం తమ ప్రత్యేకతని ఆహుజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రతినిధి శ్రుతి అహుజా చెప్పారు. గ్యాస్‌ను కోళ్లఫారాల్లో వినియోగించుకోవచ్చు. మిగిలిన వ్యర్థాన్ని ఆరబెట్టి ఎరువుగానూ, ద్రవరూపంలోనైతే చేపలకు ఆహారంగానూ వాడవచ్చు. ఒకటిన్నర టన్నుల పౌల్ట్రీ వ్యర్థంతో దాదాపు వంద ఘనపుమీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఇది 42 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో సమానమని శ్రుతి వివరించా రు. కార్యక్రమంలో ఐఐసీటీ బయోఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ విభాగం సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎ.గంగాగ్నిరావు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఎ.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.