పవర్ గ్రిడ్ ఎఫ్‌పీవో షేరు @ రూ. 90
న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి సంబంధించి షేరు ధర అప్పర్ బ్యాండ్‌లో రూ. 90గా ఖరారైంది. రిటైల్ ఇన్వెస్టర్లు, అర్హులైన ఉద్యోగులకు షేరుపై రూ. 4.50 మేర డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎఫ్‌పీవో ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు రానుండగా.. ఇందులో కేంద్రానికి రూ. 1,600 కోట్లు లభిస్తాయి. మిగతాది రూ. 5,400 కోట్లు కంపెనీకి లభిస్తుంది. రూ. 85-90 ధర శ్రేణితో గత వారం నిర్వహించిన ఎఫ్‌పీవోలో ప్రభుత్వం 18.51 కోట్ల షేర్లను, కంపెనీ కొత్తగా మరో 60.18 కోట్ల షేర్లను విక్రయించాయి. ఈ ఇష్యూ 6.78 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది. తాజా ఎఫ్‌పీవో అనంతరం కంపెనీలో ప్రభుత్వ వాటా 69.42% నుంచి 57.89%నికి తగ్గుతుంది.