Power minister G. Jagadish Reddy
-
లోకకల్యాణానికి శివుడిని ప్రార్థించా
దామరచర్ల (మిర్యాలగూడ) : లోక కల్యాణం కోసం మహా శివుడిని ప్రార్థించానని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా వాడపల్లిలోని పుణ్యక్షేత్రంలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు కలశంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల చరిత్రను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురియాలని, పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరుడికి పూజలు చేసినట్లు తెలిపారు. వాడపల్లి దేవాలయాల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అంతకుముందు మంత్రిని మిర్యాలగూడ నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీతో వాడపల్లి పుణ్యక్షేత్రానికి తోడ్కొని వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ వీరకోటిరెడ్డి, చల్లా అంజిరెడ్డి, బాలాజీ, ఆర్డీఓ గోపాల్‌రావు, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, సీఐ రమేష్‌బాబు, ఎస్ఐ రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌నే మోరీల్లో వేస్తారు..
నిడమనూరు (నాగార్జునసాగర్) : టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్‌ను ప్రజలు 2019 ఎన్నికల్లో మోరీల్లో వేస్తారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సభలో మంత్రి మాట్లాడుతూ తాగిన మత్తులో చేసుకున్న హత్యను రాజకీయలబ్ధికి కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు వాడుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని.. మా ఆలోచన అలాంటిది కాదని.. అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు. ఎక్కువ శాఖలు చేసిన అని గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డి తన సమక్షంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మీద ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. జానారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు ఉండవనుకున్నానని.. కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడే ఎక్కువ ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో డజను సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రతి గ్రామానికి శుద్ధిచేసిన జలాలను అందిస్తామన్నారు. కేసీఆర్ వెంటే.. సాగర్ నియోజకవర్గం ఉంటదని ఎర్రబెల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో నిరూపన అయ్యిందన్నారు. ఎక్కువ కాలం జానారెడ్డికి ఓటు వేయడంతో నియోజకవర్గ ప్రజల చేతులు కాయలు కాచాయన్నారు. మండలంలోని జంగాలగూడెం, ఎర్రబెల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించే రెండు కమ్యూనిటీ హాళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు నూకల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ దాసరి నర్సింహ, కేవీ రామారావు, అంకతి వెంకటరమణ, మన్నెం రంజిత్‌యాదవ్, సర్పంచ్ తాటి సత్యపాల్, ఎంపీటీసీ మన్నెం వెంకటరమణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి, మేరెడ్డి వెంకట్‌రెడ్డి, సూలకంటి వీరారెడ్డి, గడ్డం రవీందర్‌రెడ్డి, మంజుల సీతారాములు, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్‌రెడ్డి
సూర్యాపేట : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై ఫిబ్రవరి 26న పరువునష్ట దావా వేసిన కేసు విషయంలో విచారణ నిమిత్తం పొన్నం ప్రభాకర్ గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు న్యాయస్థానం కేసుకు సంబంధించిన కాగితాలు అందజేసింది. ఫిర్యాదు దారుడైన మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్ జూన్ 3వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇరువురు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి తరుపున న్యాయవాదులు గ్రంథి వెంకటేశ్వర్లు, గుడిపూడి వెంకటేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ వెంట న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాసరావు, నూకల సుదర్శన్‌రెడ్డిలు ఉన్నారు.