prabakarrao
-
నిరసనలు.. నిలదీతలు
కుంటాల/భైంసారూరల్, న్యూస్‌లైన్ : భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన భైంసా మండలం రచ్చబండ మూడో విడత కార్యక్రమం నిరసనలు, నిలదీతల మధ్య ముగిసింది. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభంకాగానే కోతల్గాం గ్రామానికి చెందిన లక్ష్మి, హజ్గుల్ గ్రామానికి చెందిన అనురాధ పింఛన్లు ఎందుకు మంజూరు చేయడంలేదని అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా స్పందించడంలేదని మండిపడ్డారు. స్పందించిన అధికారులు అర్హులందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్‌కు తాను అన్నివిధాలా అర్హుడినైనా మంజూరు చేయకపోవడంపై పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు సురేశ్ నిరసన వ్యక్తం చేశాడు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదని పలువురు ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంతో ప్రజలకు ఒనగూరేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట ఆలస్యంగా ప్రారంభం... రచ్చబండ కార్యక్రమం ముందుగా ప్రకటించినదానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు బదులు మూడింటికి సభ మొదలైంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎండలో నిరీక్షించారు. బంగారుతల్లి పథకం బాండ్ల కోసం వచ్చిన బాలింతలూ అవస్థలు పడ్డారు. తెలంగాణ నినాదాలు... రచ్చబండ సభలో తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. పలువురు జెతైలంగాణ అంటూ నినదించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. రచ్చబండ ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దశలవారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. ప్రత్యేక అధికారి పెర్క యాదయ్య మాట్లాడుతూ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, ప్రభుత్వ సాయంతో నిర్మించుకోవాలని కోరారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు, బంగారుతల్లి బాండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో జియూవోద్దీన్, ఎంఈవో దయానంద్, పీఆర్ డిప్యూటీ ఈఈ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ డీఈ శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సోలంకి భీంరావు, మాజీ ఎంపీపీ రాంచంద్రారెడ్డి, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, ఈజీఎస్ ఏపీవో నవీన్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన వాయిదా
సాక్షి, నల్లగొండ : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. తుపాను తాకిడికి అతలాకుతలమైన జిల్లా రైతాంగాన్ని పరామర్శించేందుకు, పంట నష్టం తెలుసుకునేందుకు బుధవారం జిల్లాకు సీఎం రానున్నారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం హడావిడిగా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయింది. పలుచోట్ల స్థల పరిశీలన కూడా చేశారు. వర్షం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి శాఖలవారీగా అధికారులు సమాచారం సేకరించి దగ్గర పెట్టుకున్నారు. చివరకు పర్యటన వాయిదా పండిందని సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. సీఎం రాకపోవడానికి స్పష్టమైన కారణాలేంటన్నవి అధికారుల వద్ద కూడా లేవు. అయితే సీఎంకు వైజాగ్ పర్యటన ఖరారు కావడంతో రాలేకపోతున్నారని కొందరు అంటున్నా.. అసలు దీని వెనుక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. సీఎం వస్తున్నారని... నిడమనూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నిడమనూరుకు వస్తున్నారని కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సమావేశ స్థలాలను ఎంపిక చేశారు. వేంపాడు స్టేజీ వద్ద హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జోనల్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రసాదరావు, జిల్లా పశువర్ధక శాఖ సహాయసంచాలకులు ఖదీర్, ఐబీ ఈఈ హమీద్‌ఖాన్, డీఈ సురేందర్‌రెడ్డి, ఏఈలు చెన్నకేశవరెడ్డి, హలీం, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, నిడమనూరు మార్కెట్‌కమిటీ చైర్మన్ రాయలింగయ్య, మాజీ ఎంపీపీ హన్మంతరావు, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో ప్రతాప్‌నాయక్, నాగభూషణ్‌రావు, సీఐ ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, ఉన్నం చినవీరయ్య, నల్లబోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడలో పర్యటించాలని సీఎంను కోరిన జూలకంటి మిర్యాలగూడ : ఇటీవల కురిసిన వర్షాలకు అపార నష్టం నెలకొన్నందున బాధితులను పరామర్శించడానికి మిర్యాలగూడకు రావాలని ముఖ్యమంత్రి కిరణ్‌ను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సీఎం కిరణ్‌కుఫోన్ చేసిన జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా రావాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బుధవారం జిల్లాలో పర్యటించడం లేదని, షెడ్యూల్ మారిందని, మరోసారి జిల్లాకు వచ్చిన సమయంలో మిర్యాలగూడకు వస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు రంగారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరోసారి జిల్లాకు వచ్చినపుడు మిర్యాలగూడకు తప్పకుండా రావాలని కోరినట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.