prabhu kumar
-
సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్‌తో ఏమీ కాదని అజాగ్రత్తగా ఉండొద్దని జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డా. ప్రభుకుమార్ చల్లగాలి (లైఫ్ మల్టీస్పెషాలిటీ క్లినిక్స్) హెచ్చరించారు. వృద్ధులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై డెల్టా, ఒమిక్రాన్‌ల తీవ్రత ఒకేలా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. డెల్టా రకంతో ఇంకా ప్రమాదమేనని చెప్పారు. వచ్చే మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియెంట్‌తో పిల్లలకు ముప్పేమీ లేదని చెప్పారు. కరోనా కొత్త మ్యుటేషన్లు వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. వివిధ అంశాలపై ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏమన్నారంటే.. పండుగలప్పుడు నిర్లక్ష్యం వల్లే.. ఒమిక్రాన్ చాలా మటుకు సాధారణ జలుబుగానే వెళ్లిపోతోంది. చాలా మంది మూడు నుంచి ఐదు రోజుల్లోనే మామూలై పోతున్నారు. కరోనా లక్షణాల్లో ఇప్పుడు ఎక్కువగా గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, కీళ్లు, కాళ్ల నొప్పులే ఉంటున్నాయి. ఎవరికైతే రెండు, మూడు రోజుల్లో వైరస్ తీవ్రత తగ్గట్లేదో, ఆక్సిజన్ సాచురేషన్ 95 శాతం కంటే తగ్గుతోందో వారిపై వైద్యులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తీవ్రంగా మారుతున్న వారికే యాంటీ వైరల్ మందులు ఇస్తున్నారు. అయితే ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలతో ప్రభావం చూపుతోందని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. అందరికీ ఇది సోకే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మనకూ వచ్చి పోతే మంచిదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. రాబోయే 3 వారాలు అనవసర ప్రయాణాలు నియంత్రించి జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ క్రమంగా తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా మారితే.. అన్ని దేశాల్లో డెల్టాను అధిగమించి ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్‌గా మారి 95 శాతం ఈ కేసులే వచ్చినపుడు కరోనా దాదాపుగా తగ్గిపోతుందనేది ఒక అంచనా. నెదర్లాండ్స్, అమెరికా, యూకేలలో 95 శాతం కేసులు ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. మనదేశంలోనూ డెల్టా కేసులను ఒమిక్రాన్ కేసులు అధిగమిస్తే ఇక్కడా గణనీయమైన మార్పులు వస్తాయి. ఏదో ఓ మూల నుంచి మళ్లీ రావొచ్చు వందేళ్ల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ.. ఒకటి, రెండు వేవ్‌లు ప్రభావం చూపి థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్‌తో ముగిసింది. ఇప్పుడు కరోనాలోనూ ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐతే వైరస్ పూర్తిగా అంతర్థానమై పోదని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అనేక వైరస్లు సజీవంగా ఉంటాయి. ఏదో ఓ మూల నుంచి మళ్లీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
ప్రభుకుమార్‌కు ‘నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ చైర్మన్, ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలిని ‘డాక్టర్ కేతన్ నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు వరించింది. ప్రభుకుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఐఎంఏ ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో ఏఎంఏ హౌస్‌లో ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జాతీయ నేతలు, వైద్యరంగ ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారని అవార్డు నిర్వాహకుడు, ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్, ప్రధాన కార్యదర్శి జయేశ్ లేలే ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ప్రభుకుమార్ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అనేకమంది పేషెంట్ల కు వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ అనేకమంది మన్ననలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి అవార్డులతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. -
థర్డ్‌వేవ్ ప్రమాదం: వచ్చే 2, 3 వారాలు అత్యంత కీలకం
అంతా బాగుందనే భావనతో తప్పటడుగులు వేయొద్దని హెచ్చరికలు దేశంలో కోవిడ్ కేసుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. మళ్లీ కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సీరియస్ కోవిడ్ కేసులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే 2, 3 వారాలు కీలకంగా మారనున్నాయి. దేశంలో మూడోదశ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌కల్లా ఉచ్ఛస్థాయికి వెళ్లొచ్చని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌కు ఆజ్యం పోయొచ్చని ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్ చెప్పారు. అయితే సెకండ్‌వేవ్‌లో మాదిరిగా రోజుకు నాలుగు లక్షల కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు వంటి అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు. – సాక్షి, హైదరాబాద్ పాత జీవన విధానం కోరుకుంటూ.. ఏడాదిన్నరగా రెండు లాక్డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి దశలో కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ పాత జీవన విధానాన్ని కోరుకుంటూ స్వేచ్ఛగా అన్నిచోట్లకు వెళ్లే ప్రయత్నంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుత దశను వారు పరీక్షా సమయంగా అభివర్ణిస్తున్నారు. చాలామంది అంతా మామూలై పోయినట్టుగా ప్రవర్తించడం, మాస్క్‌లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు అంటూ తిరగుతుండటంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ వ్యాప్తికి సానుకూల వాతావరణం ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపించకపోవడంతో కొందరి ఆరోగ్యం విషమిస్తోంది. కేసుల పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందడానికి అనువుగా ఉన్నాయి. ప్రజలు వీటిని గుర్తెరిగి మసలుకోవాల్సి ఉంది. –డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ కొత్త స్పైక్స్ రావొచ్చు వివిధ రాష్ట్రాల్లో డెల్టా వేరియెంట్ ఇంకా ప్రబలంగా ఉంది. ప్రస్తుతమున్న డెల్టాతోనే నిబంధనలు పాటించని చోట కొత్త స్పైక్స్ రావొచ్చు. కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగితేనే వేవ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి థర్డ్‌వేవ్‌గా మారడానికి నెలన్నర, రెండు నెలలు పట్టొచ్చు. అప్పుడు చిన్నపిల్లలతోపాటు అందరూ ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే సెకండ్‌వేవ్‌లో ఉన్నంత ఉధృతి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఎలాంటి వేరియెంట్లు ఇక్కడ పుట్టలేదు. తెలంగాణలో 40 శాతం మందిలో (6 ఏళ్లు పైబడిన వారిలో) ఇంకా యాంటీబాడీస్ ఏర్పడలేదు. అంటే మన రాష్ట్రంలో ఒక్క డోస్ టీకా కూడా వేసుకోకపోవడం లేదా ఇంకా వైరస్ బారిన పడని వారు 40 శాతం దాకా ఉన్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్ కేసుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బోనాలు, సీజన్ మార్పు తదితర కారణాలతో వచ్చే 15, 20 రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగితే థర్డ్‌వేవ్‌కు దారితీయొచ్చు. థర్డ్‌వేవ్ వస్తే ఆ ప్రభావం అక్టోబర్ వరకు ఉండొచ్చు. కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. బ్లాక్ ఫంగస్ కేసులు కొంత మేర తగ్గినట్టే కనిపిస్తోంది. అవసరానికి మించి జింక్, ఐరన్ తీసుకుంటున్న వారిలో ఈ సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఆస్పత్రులు సిద్ధమై ఉండటం సానుకూలాంశం. –డాక్టర్ ఎ. నవీన్‌రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణులు, నవీన్‌రెడ్డి హాస్పిటల్ -
ప్రేమించమంటూ బెదిరింపులు
టీనగర్: ప్రేమించమంటూ విద్యార్థినిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనను ప్రేమించకుంటే స్వాతికి పట్టిన గతే నీకు పడుతుందని సదరు విద్యార్థినిని భయపెట్టాడీ ప్రబుద్ధుడు. ఇటీవల నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో మహిళా ఇంజినీరు స్వాతి హత్యకు గురైన విషయం తెలిసిందే. మనలి చిన్న సేక్కాడు వవుసి వీధికి చెందిన ఏళుమలై కుమార్తె తిరువొత్తియూర్‌లోని ఒక ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఈమె సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేసి తనను ప్రేమించాలని,లేకపోతే స్వాతికి పట్టిన గతే పడుతుందని బెదిరించాడు. ఈ విషయాన్ని యువతి తండ్రికి తెలిపింది. ఏళుమలై మనలి పుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ (19) విద్యార్థినిని బెదిరించినట్లు తెలిసింది. -
వైఎస్సార్ సీపీ సత్తా చాటుతాం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ సీపీ సత్తా చాటుతామని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం తాండూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి, ప్రభుకుమార్ మాట్లాడుతూ.. స్వార్ధపూరిత రాజకీయాలతో పేదల అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందని వారు ధీమా వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుపరిచిన ప్రజా సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు రుణాలు, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీకి ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి ఇందిరాచౌక్, శివాజీచౌక్, మల్రెడ్డిపల్లి, బసవన్నకట్ట, పాతతాండూరు మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. మల్రెడ్డిపల్లి, పాతతాండూరు, గుమాస్తానగర్తోపాటు పలుచోట్ల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, వడ్డెర సంఘం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు హబీబ్‌ఖాన్, సత్యమూర్తి, మంజుల, ఆనంద్, అమ్జద్, సంతోష్, అఖీల్ పాల్గొన్నారు.