అంతా బాగుందనే భావనతో తప్పటడుగులు వేయొద్దని హెచ్చరికలు దేశంలో కోవిడ్ కేసుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. మళ్లీ కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సీరియస్ కోవిడ్ కేసులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే 2, 3 వారాలు కీలకంగా మారనున్నాయి. దేశంలో మూడోదశ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌కల్లా ఉచ్ఛస్థాయికి వెళ్లొచ్చని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌కు ఆజ్యం పోయొచ్చని ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్ చెప్పారు. అయితే సెకండ్‌వేవ్‌లో మాదిరిగా రోజుకు నాలుగు లక్షల కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు వంటి అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు.
– సాక్షి, హైదరాబాద్
పాత జీవన విధానం కోరుకుంటూ..
ఏడాదిన్నరగా రెండు లాక్‌డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి దశలో కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ పాత జీవన విధానాన్ని కోరుకుంటూ స్వేచ్ఛగా అన్నిచోట్లకు వెళ్లే ప్రయత్నంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుత దశను వారు పరీక్షా సమయంగా అభివర్ణిస్తున్నారు. చాలామంది అంతా మామూలై పోయినట్టుగా ప్రవర్తించడం, మాస్క్‌లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు అంటూ తిరగుతుండటంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.
వైరస్ వ్యాప్తికి సానుకూల వాతావరణం
ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపించకపోవడంతో కొందరి ఆరోగ్యం విషమిస్తోంది. కేసుల పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందడానికి అనువుగా ఉన్నాయి. ప్రజలు వీటిని గుర్తెరిగి మసలుకోవాల్సి ఉంది.
–డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్
కొత్త స్పైక్స్ రావొచ్చు
వివిధ రాష్ట్రాల్లో డెల్టా వేరియెంట్ ఇంకా ప్రబలంగా ఉంది. ప్రస్తుతమున్న డెల్టాతోనే నిబంధనలు పాటించని చోట కొత్త స్పైక్స్ రావొచ్చు. కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగితేనే వేవ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి థర్డ్‌వేవ్‌గా మారడానికి నెలన్నర, రెండు నెలలు పట్టొచ్చు. అప్పుడు చిన్నపిల్లలతోపాటు అందరూ ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే సెకండ్‌వేవ్‌లో ఉన్నంత ఉధృతి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఎలాంటి వేరియెంట్లు ఇక్కడ పుట్టలేదు. తెలంగాణలో 40 శాతం మందిలో (6 ఏళ్లు పైబడిన వారిలో) ఇంకా యాంటీబాడీస్ ఏర్పడలేదు. అంటే మన రాష్ట్రంలో ఒక్క డోస్ టీకా కూడా వేసుకోకపోవడం లేదా ఇంకా వైరస్ బారిన పడని వారు 40 శాతం దాకా ఉన్నారు.
ఆస్పత్రుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి
ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్ కేసుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బోనాలు, సీజన్ మార్పు తదితర కారణాలతో వచ్చే 15, 20 రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగితే థర్డ్‌వేవ్‌కు దారితీయొచ్చు. థర్డ్‌వేవ్ వస్తే ఆ ప్రభావం అక్టోబర్ వరకు ఉండొచ్చు. కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. బ్లాక్ ఫంగస్ కేసులు కొంత మేర తగ్గినట్టే కనిపిస్తోంది. అవసరానికి మించి జింక్, ఐరన్ తీసుకుంటున్న వారిలో ఈ సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఆస్పత్రులు సిద్ధమై ఉండటం సానుకూలాంశం.
–డాక్టర్ ఎ. నవీన్‌రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణులు, నవీన్‌రెడ్డి హాస్పిటల్
Comments
Please login to add a commentAdd a comment