pradeep krishnamurthy
-
కపటధారి మూవీ రివ్యూ
టైటిల్ : కపటధారి జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్ దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి సంగీతం : సిమన్ కె కింగ్ సినిమాటోగ్రఫీ : రసమతి ఎడిటర్ : ప్రవీన్ కేఎల్ విడుదల తేది : ఫిబ్రవరి 19 అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్ కృషి చేస్తున్నాడు. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్.. ఇప్పుడు థ్రిల్లర్ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్ అందించిందా? రివ్యూలో చూద్దాం. కథ గౌతమ్ (సుమంత్) ఒక సిన్సియర్ ట్రాఫిక్ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్ కేసులను విచారించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా..పై అధికారులు అతనికి ప్రమోషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్ గోపాల్ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్ చేసిన రిటైర్డ్ పోలీసు అధికారి రంజన్ (నాజర్) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ. నటీనటులు ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్ పాత్ర. రిటైర్డ్ పోలీసు అధికారి రంజిత్ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ రెండు మూడు సీన్లలో కనిపించినా.. తనదైన కామెడీ పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్ నందిత, గెస్ట్‌రోల్‌లో కనిపించిన సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్ కుమార్ తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘కవలుధారి’కి రీమేక్‌గా వచ్చింది ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్ సినిమా కావడంతో విడుదలైన రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. అదే నమ్మకంతో ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగులో ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు కొద్దిమేరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్ చేయగలిగాడు కానీ ఎమోషనల్ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. అది కొంత మైనస్. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చూశాం కదా అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్, నాజర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్ అంశాలు నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ స్ర్కీన్ ప్లే రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున
‘‘కపటధారి ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కష్ణమూర్తి దర్శకత్వంలో డా. ధనంజయన్ నిర్మించిన చిత్రం ‘కపటధారి’. ఈ శుక్రవారం విడుద లవుతున్న ఈ చిత్రం కన్నడ ‘కవలుధారి’కి రీమేక్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా? అనుకున్నాం. ‘క్రాక్’ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్‌కి కంగ్రాట్స్. ఈ విజయాలు ‘కపటధారి’ యూనిట్‌కు నమ్మకాన్నిచ్చాయి’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకు మా చిన్న మావయ్యే (నాగార్జున) స్ఫూర్తి. ‘కపటధారి’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్ సినిమాను లీడ్ చేస్తుందనే నమ్మకం పెరిగింది’’ అన్నారు ధనంజయన్. ‘‘తెలుగు, తమిళంలో నేనే దర్శకత్వం వహించాను’’ అన్నారు ప్రదీప్ కృష్ణమూర్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో లైన్ తవ్వకాల్లో అస్థి పంజరాలు!
సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కపటధారి. ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత అక్కినేని- నాగచైతన్య నేడు సాయంత్రం విడుదల చేశారు. ఇందులో మెట్రోలైన్ తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడతాయి. అది ఎవరిది? వారిని ఎవరు? ఎందుకు చంపారు? దీని వెనక ఉన్నదెవరు? అన్న అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టి దోషులను శికక్షించాలన్న కసితో ఆ కేసును పూర్తిగా స్టడీ చేస్తుంటాడు ట్రాఫిక్ పోలీసాఫీసర్ అలియాస్ హీరో సుమంత్. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్‌కు ఓపెన్ చేసిన కేసును క్లోజ్ చేశాకే ప్రశాంతంగా ఉంటుందంటున్నాడు నాజర్. నిజంగా ఆయన చెప్పినట్లుగానే సుశాంత్ కూడా నిరంతరం ఆ కేసును చేధించేందుకు తీవ్రంగా పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!) ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ, నిజానిజాలు నిర్ధారణ చేసుకుంటూ కేసు పరిష్కారం దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. అయితే ఇదంతా ఎవరు చేశారో తెలిస్తే షాకైపోతావని చెప్తున్నాడో వ్యక్తి. మరి ఆ హంతుకుడి గురించి ఆయన నిజంగానే నోరు విప్పాడా? లేదా సుమంతే అతడిని కనుక్కున్నాడా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే. సస్పెన్స్ అంశాలు బాగానే దట్టించిన ఈ థ్రిల్లర్ ట్రైలర్ సోషల్ మీడియాలో జనాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో నందిని శ్వేత హీరోయిన్గా నటించగా ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ నెంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.. (చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే : శ్రుతీహాసన్) -
ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్
‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో జోష్ ట్రాక్‌లో ఉన్న రాజశేఖర్ నటించనున్న తాజా చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ చేసిన టీమ్‌కి తమిళ దర్శకుడు, మాటల రచయిత జాన్ మహేంద్రన్ నేతృత్వం వహించారు. చిత్రదర్శక, నిర్మాతలు, జాన్‌మహేంద్రన్, సినిమా తెలుగు డైలాగ్ రైటర్, గేయ రచయిత విశ్వ వేమూరి కథ, స్క్రీన్‌ప్లేను సోమవారం రాజశేఖర్, జీవితలకు అందజేశారు. ‘‘కథ చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగా కుదిరింది. ఉత్కంఠభరితంగా సాగడంతో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘హైదరాబాద్, చెన్నైలో సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని జి. ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్ నటించే ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.పి. శివప్రసాద్. -
లిప్‌లాక్ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!
చెన్నై: సాధారణంగా లిప్‌లాక్ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు. అయితే తమిళ నటుడు సిబిరాజ్ హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ససేమిరా అన్నారు. ఆ సంగతేమిటో చూద్దాం. సత్యరాజ్ సమర్పణలో ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా నటిస్తూ, నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సత్య. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి రామ్యానంబీశన్ హీరోయిన్ గానూ, నటి వరలక్ష్మీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. 555 చిత్రం ఫేమ్ సైమన్ సంగీతాన్ని అందించారు. సత్య మూవీ జూన్ చివర్లో తెరపైకి రానుంది. ప్రదీప్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గతంలో నటుడు కమలహాసన్ నటించిన సత్య చిత్రం ఆయన కేరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో, అదే విధంగా నటుడు సిబిరాజ్‌కు ఈ సత్య పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం. తెలుగులో విజయం సాధించిన ‘క్షణం’ చిత్రానికి ఇది రీమేక్. మూవీ స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే, ఆ సీన్లో నటించాలని ఎంతగా నచ్చజెప్పినా హీరో సిబిరాజ్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ చిత్రాన్ని తన కూతురు కూడా చూస్తుందనే కారణాన్ని సిబిరాజ్ చెప్పారని' ఈ సందర్భంగా వివరించారు.