Pragna singh
-
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ప్రమాణంపై వివాదం..
న్యూఢిల్లీ: వివాదాలకు తెరలేపుతూ సంచలన వ్యాఖ్యలు చేసే భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొత్తగా గెలిచిన లోక్‌సభ సభ్యులు సోమవారం పార్లమెంటులో ప్రమాణం స్వీకరించారు. ఈ సందర్భంగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ తన పూర్తి పేరుతో ప్రమాణం చేశారు. తన పేరు చివర ఆధ్యాత్మిక గురువు ‘స్వామి పూర్ణాచేతనానంద అవధేషానంద్ గిరి’ పేరును జోడించి ప్రమాణం చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె తన పేరు చివరన ఆధ్యాత్మిక గురువు పేరుకు కూడా జోడించారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సాధ్వీ తన పూర్తి పేరు ఇదేనని, తన ప్రమాణ స్వీకార పత్రంలోనూ ఇదే పేరు మొదటగా చేర్చానని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్.. రిటర్నింగ్ అధికారి జారీచేసిన ఎన్నికల సర్టిఫికెట్‌లోని వాస్తవంగా ఉన్న పేరునే పరిగణనలోకి తీసుకుంటామని, ఒకవేళ ప్రజ్ఞాసింగ్ తన పేరులో మార్పు చేసినట్టయితే.. ఎన్నికల సర్టిఫికెట్‌లోని పేరునే రికార్డుల్లో కొనసాగిస్తామని ప్రతిపక్ష సభ్యులకు హామీ ఇచ్చారు. ఆమె ప్రమాణంపై ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరోవైపు అధికార బీజేపీ ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. కరతాళ ధ్వనులు చేశారు. ఈ క్రమంలో సంస్కృతంలో ప్రమాణం చేసిన స్వాధీ ‘భారత్ మాతా కీ జై’ అంటూ చివర్లో నినాదించారు. -
మనం పరమ భక్తులం కదా!
గాంధీని చంపిన 71 సంవత్సరాల తరువాత గాంధీని, హత్యచేసిన గాడ్సేను చిరస్మరణీయులంటున్నాం. ఓం గాంధీ దేవా యనమః అని ఒక చోట అంటుంటే నాథూరాం గాడ్సే నమోస్తుతే అని మరో చోట అంటున్నాం. గాంధీ వల్లనే దేశ విభజన జరిగిందనీ, చాలామంది సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను కోరుకున్నా గాంధీ కావాలని నెహ్రూను ప్రథాని చేయడం వల్లనే దేశం అన్ని అనర్థాలకు గురైందని, నెహ్రూ వల్ల పాకిస్తాన్, చైనాలు కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని నమ్మించే ప్రచారం విపరీతం. రాహుల్ గాంధీనుంచి వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లి, ఆయన తండ్రిని తాతను ముత్తాతను, గాంధీని కూడా నిందించడమే ఎజెండా. ఆ వీడియోలు, ఆడియోలు ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో గుప్పించారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు కాంగ్రెస్ అనుసరించిందని విమర్శలు కూడా పద్ధతి ప్రకారం జనంలో ప్రవేశ పెట్టారు. దక్షిణాదిన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్ హాసన్ స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువనీ, అతని పేరు నాథూరాం గాడ్సే అనీ, ఆరకంగా టెర్రరిజం ప్రారంభమైందని మే 12న తమిళనాడులో చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేసిన, హిందూ టెర్రరిజం నిందితురాలు సా«ధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దీనికి నాలుగురోజుల తరువాత స్పందించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడని, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశభక్తుడే అని తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆమె కమలంతో గెలిచారు. కమల్ పార్టీ ఓడిపోయింది. చిత్రమేమంటే గాడ్సేను మొదటి టెర్రరిస్టు అని వర్ణించిన కమల్ హాసన్ తానే రచించి, నటించి, దర్శకత్వం వహించిన హే రాం అనే సినిమాలో గాంధీని చంపడానికి సాకేత్ రాం అయ్యంగార్ అనే యువకుడు ప్రయత్నించినట్టు చిత్రించారు. 2000 లో వచ్చిన ఈ సినిమాలో సాకేత్ కూడా గాడ్సే వలెనే ఆలోచిస్తుంటాడు. ఈ కాల్పనిక చారిత్రిక చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసన్ కొంత వరకు గాడ్సే ఆలోచనలను సమర్థించినట్టే కదా. కనీసం గాడ్సే వలె ఇంకా మరికొందరు ఆలోచించారని చెప్పడానికి ప్రయత్నించినట్టే కదా? సినిమా వ్యాపారం కోసం గాడ్సే ఆలోచనలను సినిమా పొడుగునా సమర్థించి చివరకు మనసు మార్చుకున్నట్టు చూపిన కమల్ హాసన్‌కు గాడ్సే టెర్రరిస్టు అని చెప్పే నైతిక హక్కు ఉందా? సినిమా డబ్బుకోసం, ఎన్నికల ఓట్లకోసం గాడ్సేను వాడుకుంటారా? ఇక హత్యకేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దృష్టిలో గాడ్సే దేశభక్తుడు. ఇంకా కేసు ముగియకముందే ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసి భోపాల్ నుంచి గెలిపించుకున్నది. గాంధీని హత్య చేసిన తరువాత కింది కోర్టులో గాడ్సేకు ఉరిశిక్ష పడింది. ఆయన హత్య చేయలేదని బుకాయించలేదు. రుజువులు చాలవని తనను విడుదల చేయా లని లాయర్లకు చెప్పి అబద్దపు వాదనలు చేయించలేదు. ఉరిశిక్షను ధృవీకరించడం కోసం కేసు హైకోర్టుకు వచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అప్పీలు విచారించింది. వారిలో ఒక న్యాయ మూర్తి జిడి ఖోస్లా 1965లో ఒక పుస్తకం రచించారు. అందులో గాడ్సే తన చర్యకు పశ్చాత్తాప పడ్డాడనీ, తనకు బతికే అవకాశం ఉంటే శాంతి కోసం కృషి చేస్తానని దేశ సేవ చేస్తానని అనుకున్నారని న్యాయమూర్తి వివరించారు. గాంధీ తన దారి మార్చుకోలేదు. గాడ్సే తన నిర్ణయం మార్చుకోలేదు. 71 ఏళ్ల తరువాత దేన్నయినా మార్చుకునే సామర్థ్యం, సాహసం చేయగల ఇప్పటి ఆధునిక నాయకులతో వారిని పోల్చడానికి వీల్లేదు. కమల్ తన ప్రకటనను మార్చారు. నేను గాడ్సేను టెర్రరిస్టు అనలేదని, తీవ్రవాది అన్నానని కమల్ మాట మార్చారు. ప్రజ్ఞ తన మాట మార్చారు. క్షమాపణలు కోరి ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ప్రథాన మంత్రికి కోపం వచ్చింది. ప్రజ్ఞను తాను క్షమించబోనని చెప్పారు. ఈ మాట చెప్పడానికి ఎన్నడూ లేంది, డిల్లీలో అయిదేళ్లలో తొలిసారి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ప్రథాని. క్షమించడం సంగతి పక్కన బెడితే, ప్రజ్ఞ బీజేపీ ఎంపీగా కొనసాగడం, ఆమెగారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించడం జరిగిపోతూనే ఉంటుంది. మనకు గాంధీతోపాటు గాడ్సే కూడా దేవుడు. గాంధీకి గాడ్సేకు కూడా గుడులు కడతారు. సోనియా గాంధీ, ఖుష్బూ, అమితాబ్, సచిన్‌లకు కూడా గుడులు కడతారు. జనం, ఓటర్లు భక్తులు, ఒకే గాటన పోతూ ఉంటారు. వీళ్లకు ఎడమచేతితో వందమందిని పిట్టల్ని చంపినట్టు చంపే హీరోలు కావాలి. చిటికెలో మాయచేసి సమస్యలు పరిష్కరించే దైవిక శక్తులున్న నాయకులు ఉంటారని వస్తారని, వచ్చా రని వారిచేతుల్లో మంత్రదండాలు ఉంటాయని, వీర బ్రహ్మంగారు వీరిగురించే చెప్పారని, నోస్ట్రాడామస్ చెప్పిందీ ఇదే అని అంటారు. భక్తితో భజనలు చేస్తారు. మనం పరమభక్తులం మరి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఊరట లభించింది. ఆమె నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్ఞా సింగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 2008 మాలేగావ్ పేలుళ్లలో తన కుమారుడిని కోల్పోయిన వ్యక్తి ప్రజ్ఞా సింగ్ నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాలెగావ్ పేలుడు కేసులో ప్రజ్ఞా సింగ్ నిందితురాలు కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎవరినైనా నియంత్రించే అధికారం తమకు లేదని, దీనిపై ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకోవాలని ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు తమ న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేయలేదని పేర్కొంది. పిటిషనర్ ప్రజ్ఞా సింగ్ నామినేషన్‌ను సవాల్ చేస్తూ సరైన వేదికను ఆశ్రయించలేదని స్పష్టం చేసింది. -
జైలులో సాధ్వి ఆమరణదీక్ష
భోపాల్: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో క్లీన్ చీట్ పొందిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ జైలులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు వెల్లేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి దీక్షకు దిగారు. దీనిపై స్పందించిన దేవాస్ లోని న్యాయస్థానం మే 21 లోగా సాధ్విని కుంభమేళాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని సోమవారం పోలీసులను ఆదేశించింది. సాధ్వితో సహా మరో 12 మందిని 2008లో మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మెకా చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2008 అక్టోబర్ నుంచి సాధ్వి జైలులో ఉంటున్నారు. అయితే సాధ్వి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో పేర్కొంది.