పోలీసులకు సవాల్‌గా ప్రమీల హత్య కేసు !
పాలకొండ: సంచలనం కలిగించిన పాలకొండకు చెందిన ప్రమీల హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని త్వరగా పట్టుకోవడానికి పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకులు ఏ ఒక్క ఆధారాన్ని ఉంచకుండా ప్రణాళిక ప్రకారం హ త్య చేసి జారుకోడంతో దీన్ని ఎలాగైనా ఛేదించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. శుక్రవారం దారుణ హత్యకు గురైన ప్రమీల మృతదేహానికి శనివారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కేసును ఛేదించే పనిలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు ప్రోత్సహించేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటికే కేసుపై ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పోస్టుమార్టంలో ప్రాథమికంగా కొన్ని ఆధారాలు బయటపడినట్టు సమాచారం.
హంతకులు అత్యంత కిరాతకంగా హతమార్చారని వైద్యులు నిర్ధారించారు. మెడ, గెడ్డంపైన కత్తిపోట్లతో పాటు తలపై మెదడు బయటకు వచ్చేలా కర్రతో బాదిన ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. కేసులో కీలకంగా మారే మరికొన్ని అంశాలను గోప్యంగా ఉంచారు. కాగా హత్య జరిగిన ఇంట్లో రెండు ప్లేట్లలో ఆమ్లెట్ లు వేసి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా మృతిరాలి భర్త శుక్రవారం నాన్‌వేజ్ తీసుకోరని, ఇవి ఎందుకోసం వేసి ఉంటారన్న దానిపైన పోలీసులు దృష్టిసారించారు. మరోవైపు హంతకులు బీరువాల జోలుకుపోకుండా కేవలం హత్యకు గురైన మహిళ మెడలోనూ, చేతికి ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
రక్తపు మడుగులో ఒక చైన్ దొరికినట్టు సమాచారం. దొంగతనానికి వచ్చిన వారైతే బీరువాలను సైతం విరగొట్టేవారని, కేవలం అందుబాటులో ఉన్న బంగారం ఎత్తుకుపోవడం, అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరంపై పోలీసులు దృష్టిసారించారు. పరిసరాలను పరిశీలించాక పూర్తిగా వీరి కోసం తెలిసిన వ్యక్తి సహాయం లేకుండా ఇంట్లోకి చొరబడడం సాధ్యం కాదని చెబుతున్నారు. స్థానికుల సహాయంతోనే ఈ సంఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసు జాగిలాలు ఆస్పత్రి రహదారిగుండా వెళ్లి పక్కనే ఉన్న వీధులో నుంచివెంకటరాయుని కోనేరు గట్టుకు చేరుకున్నాయి. అనంతరం చెరువులో దిగడం, సేదతీర్చేందుకు ఏర్పాటు చేసిన బల్ల చుట్టూ తిరిగి ఉండిపోయాయి. దీంతో నిందితుడు చెరువులో రక్తపు మరకలు కడుక్కొని బళ్లపై సేదదీరినట్టు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఈ దారులు తెలుసుకోవడం కష్టమని, ఈ పరిస్థితిలో హత్యకు పాల్పడింది తెలిసిన వారిగా భావిస్తున్నారు.
ఎస్పీ సందర్శన
ఎస్పీ ఏ.ఎస్.ఖాన్ శనివారం 12 గంటలకు సంఘటన జరిగిన ఇంటికి చేరుకొని గంటపాటు పరిశీలన చేశారు. చుట్టుపక్కల వారిని ఆరా తీయడంతో పాటు పరిసరాలను గమనించారు. ఇంట్లో అన్నింటినీ పరిశీలించారు. డీఎస్పీ ఆదినారాయణకు కేసుపై సూచనలు చేశారు.