తండ్రి ఓడాడు.. కొడుకు గెలిచాడు..
నారాయణ్ రాణే కుటుంబానికి మిశ్రమ ఫలితం
సాక్షి, ముంబై: కొన్ని దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నారాయణ్ రాణే ఓడిపోతే... అతడి కుమారుడు మాత్రం మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుడాల్-మాల్వాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నారాయణ్ రాణే ఓడిపోగా, కొంకణ్ నుంచి పోటీచేసిన అతడి తనయుడు నితేష్ రాణే సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ జఠార్పై విజయఢంకా మోగించాడు. దాంతో కుమారుడిని అభినందించేందుకు రాణే ఎన్నికల కేంద్రానికి రాగా, నితేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా రాణే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం చరమదశకు చేరినా నితేష్ రాజకీయ జీవితంలో వెలుగు మొదలైందని అన్నారు. కాగా, తండ్రి ఓటమిని జీర్ణించుకోలేకపోయిన నితేష్ తన విజయోత్సవ ర్యాలీని రద్దు చేసుకోవడం గమనార్హం.