రాజ్యసభకు ఛత్రపతి వారసుడు
న్యూఢిల్లీ: మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ వారసుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త శంభాజీ రాజే ఛత్రపతి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆయనను పెద్దలసభకు నామినేట్ చేశారు. కొల్హాపూర్ను పాలించిన ఛత్రపతి శివాజీ, రాజశ్రీ సాహు వారసుడైన శంబాజీ మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రారంభించిన ఉద్యమానికి ఆయన ఆర్థిక చేయూతనిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని పలు వర్గాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడంలో శంభాజీ విశేష పాత్ర పోషించారని చెప్పాయి.
విశ్వ గాయత్రి పరివార్ అధిపతి ప్రణవ్ పాండే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని స్వీకరించబోనని ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో శంభాజీని నామినేట్ చేశారు. ప్రస్తుతం పెద్దల సభలో తనకు అనువైన వాతావరణం లేదని, అందుకే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని తిరస్కరిస్తున్నానని ప్రణవ్ పాండే పేర్కొన్నారు.