prathiba bharathi
-
రాజాం టీడీపీలో వర్గపోరు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైపోయిన టీడీపీకి రాజాంలో జీవం పోయడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ను అసమ్మతి సెగ వెంటాడుతోంది. ఇప్పటికీ పార్టీ అధిష్టానం చేస్తున్న కార్యక్రమాలు నచ్చక ప్రజలు కనీసం కన్నెత్తి చూడకపోగా, పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బ్యానర్ల కలకలం.. నాలుగు నెలలు క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రజాదరణను జీర్ణించుకోలేక ఉనికి కోసం టీడీపీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. చివరకు పార్టీలోని నియోజకవర్గ పెద్దలు కూడా సహకరించడంలేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌లు రాజాం పట్టణంలో పలుచోట్ల భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కోండ్రు మురళీమోహన్ ఫొటో ఎక్కడా కనిపించకపోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మురళీమోహన్ రాజాంపై పెత్తనంకోసం తనకు అన్యాయం చేయడం కారణంగానే ప్రతిభాభారతి కోండ్రును పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజాం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే తాను గెలిచే అవకాశాలు ఉండగా.. కోండ్రు రాకతో టికెట్ లభించలేదనే అభిప్రాయంలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో రాజాం నియోజకవర్గ టీడీపీ టిక్కెట్ తన కుమార్తె గ్రీష్మాప్రసాద్‌కు తెప్పించుకునే పనిలో ఆమె ఉన్నట్లు టీడీపీ తమ్ముళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి) అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి.. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సొంత మండలం రేగిడిలో టీడీపీని నడిపించే నాయకులు ఎవరూలేకపోవడం గమనార్హం. గతంలో క్రియాశీలకంగా ఉన్న కిమిడి రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు వినయ్‌కుమార్‌లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ►వంగర మండలంలో కోండ్రుపై వ్యతిరేక పవనాలు నడుస్తున్నాయి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్యాడర్ చాలా వరకూ వైఎస్సార్సీపీ గూటికి వెళ్లిపోయింది. కనీసం పోటీకి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. ►సంతకవిటి మండలంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కొల్ల అప్పలనాయుడును ఇంతవరకూ గుర్తించలేదు. గతంలో ఎమ్మెల్సీ రాకుండా పెద్దలు అడ్డుకోవడంతో ఈయన చాలా తక్కువగానే పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు. ►రాజాం పట్టణం, మండలంలో ప్రతిభాభారతికి అనుకూలంగా కార్యకర్తలు ఉన్నారు. దీంతో కోండ్రు కార్యక్రమాలు గాలిబుడగను తలపిస్తున్నాయి. -
తల్లికి తలకొరివి పెట్టిన మాజీ స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం : శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి మాతృమూర్తి కొత్తపల్లి లీలావతమ్మ(85) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. తల్లి పార్థివదేహానికి ప్రతిభా భారతి తలకొరివి పెట్టారు. మనుమరాలు గ్రీష్మాప్రసాద్, కుటుంబ పెద్దలు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జీ), రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొళ్ల అప్పలనాయుడు, కేసరి తదితరులు ప్రతిభా భారతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిభా భారతి 1999-2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. -
ప్రతిభాభారతి ఆరోగ్యంపై ఆందోళన
ఆరిలోవ (విశాఖ తూర్పు): తండ్రి అనారోగ్యాన్ని తట్టుకోలేక మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి గుండెపోటుకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధాప్యంతో బాధ పడుతున్న ఆమె తండ్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.పున్నయ్యను వారి స్వగ్రామమైన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి నుంచి గురువారం అర్ధరాత్రి విశాఖ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అంబులెన్స్ వెనుక కారులో వస్తున్న ప్రతిభా భారతికి రణస్థలం సమీపంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కూడా బంధువులు పినాకిల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇక్కడి వైద్యులు తెలిపారు. ప్రతిభా భారతి అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె కుమార్తె గ్రీష్మ ప్రసాద్‌ను కలసి పరామర్శించారు. మాజీ మంత్రి కోండ్రు మురళి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల అప్పలనాయుడు, రాష్ట్ర హెచ్.ఆర్.డి. సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకా సత్యకిరణ్, పలువురు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఇంట్లో చోరీ!
శ్రీకాకుళం సిటీ: నగరంలోని పీఎన్‌కాలనీ రెండవ లైనులోని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి ఇంట్లో గురువారం చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంట్లో రెండు సంవత్సరాలుగా ఎవరూ ఉండటం లేదు. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న రెండో పట్టణ సీఐ దాడి మోహనరావు గురువారం సాయంత్రం సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ ప్రదేశాలను పరిశీలించారు. చోరీపై ఆరా తీశారు. అక్కడ రెండు ఏసీ మిషన్లు, పూజా సామాగ్రి చోరీకి గురై ఉంటాయన్న స్థానికుల అభిప్రాయం మేరకు ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఇంటి వెనుక మద్యం సేవించి ఓ వ్యక్తి పడి ఉండడంతో పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ కేసు విషయమై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, చోరీ జరిగిందన్న సమాచారంతో ఇంటికి వెళ్లి పరిశీలించానని సీఐ దాడి మోహనరావు సాక్షికి తెలిపారు. దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.