చండీ యాగం ముగిసినా..
విభూతి కోసం తరలివస్తున్న భక్తులు
జగదేవ్పూర్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎర్రవల్లిలో నిర్వహించిన అయుత చండీయాగం బొట్టు (విభూతి) భక్తులకు బంగారమైంది. ఆదివారం నాటితో అయుత చండీయాగం ముగిసిన విషయం తెల్సిందే. అయితే యాగం చేసిన హోమ గుండాల్లోని విభూతి కోసం భక్తులు సోమవారం నుంచి యాగస్థలికి బారులు తీరుతున్నారు. సోమవారం నర్సింహ హోమంతో సీఎం దంపతులు పూర్ణాహుతి చేశారు.
అనంతరం అక్కడే ఉన్న భక్తులు విభూతి కోసం హోమం గుండాల వద్దకు రావడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు. మంగళవారం కూడా భక్తులు ఉదయం నుంచే యాగశాల వద్దకు రావడం ప్రారంభించారు. దీంతో హోమ గుండాల వద్ద కాపలాగా ఉన్న పోలీసులు భక్తులను లోనికి పంపిస్తూ చండీమాతను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. హోమ గుండాల వద్ద లోనికి మాత్రం ప్రవేశం కల్పించడం లేదు.
దీంతో హోమ గుండాల నుంచి ఒక్కరిద్దరు విభూతి తెచ్చి భక్తులకు ఇస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారు బొట్టు కోసం నానా ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజులుగా భక్తులు విభూతి కోసం ఉద యం నుంచే యాగశాలకు చేరుకుంటున్నారు. పోలీసులు మాత్రం తమ బంధువుల కోసం కవర్లు, టిఫిన్ బాక్సుల్లో విభూతి తీసుకవెళుతున్నారు. అదే సామాన్య భక్తులు వస్తే నుదుట బొట్టుపెట్టి వెనుకకు పంపిస్తున్నారు. దీంతో ఎంతో దూరం నుంచి విభూతి కోసం వచ్చిన భక్తులు పోలీసులు ఇలా చేయడం తగదంటున్నారు.