సురేష్ చేస్తున్న పదో ప్రయత్నం ‘ప్రేమించాలి!'
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి.
ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని సురేష్ కొండేటి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ తో తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఇందులో కొత్తవాళ్ళయిన సంతోష్, మనీషా జంటగా నటించగా, ఈ చిత్రానికి సమన్యరెడ్డి సహనిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
కథా కథనాలు ప్రధాన బలం. . . ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.