భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీపై (ప్రత్యేక ఫీజుతో ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీని పునరుద్ధరించేందుకు ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సుమారు 65వేలమంది భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది.
2018 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను పునరుద్ధరించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాసెసింగ్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చింది. అలాగే గరిష్ట పరిమితిని 65,000గా నిర్ణయించింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 3నుంచి ప్రీమియం హెచ్ 1-బీ వీసా ప్రాసెసింగ్ ను ఆరు నెలల పాటు రద్దు చేసింది. భారీ డిమాండ్, రెగ్యులర్ వీసా ప్రాసెసింగ్ లో జాప్యం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.