కడిగేసిన కాగ్!!
ముంబై: ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆరోపించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ వాటా ఉన్నా బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించిందని అసెంబ్లీ సమావేశాల చివరిరోజైన శనివారం సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రధానమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని పేర్కొంది.
అందులో మొదటిది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం సిద్ధం చేసిన ఆర్థిక పద్దులకు అనుగుణంగా పెట్టుబడలకు సంబంధంచిన నిర్ధిష్టమైన అంకెను అందజేయడంలో విఫలం కావడం మొదటిది కాగా వార్షిక ఖాతాలను సిద్ధం చేయకపోవడం, వాటిని తనిఖీ చేయించక పోవడం రెండో వైఫల్యంగా కాగ్ ఆరోపించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ లోపించిందని పేర్కొంది. మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ మూడు ఒప్పందాలకు సంబంధించి నియమనిబంధనలను తుంగలోతొక్కి డెవలపర్లకు లబ్ది చేకూర్చిందని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 149.35 కోట్లమేర ఆర్థిక భారం పడిందని ఆరోపించింది.
ఇక మహారాష్ట్ర విద్యుత్ సరఫరా కంపెనీ ఆదాయపు పన్ను మదింపు సమయంలో తప్పుడు లెక్కలు చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 33.58 నష్టం కలుగజేసిందని పేర్కొంది. ఇక మహారాష్ట్ర విద్యుదుత్పత్తి కంపెనీ అవసరం లేకున్నా సిమెంట్ పైపుల కొనుగోలు విషయంలో రూ. 4.01 కోట్లు ఖర్చు చేయించిందని ఆరోపించింది. నీటి ఖర్చు విషయంలో కూడా లెక్కలు సరిగ్గా చూపలేదని పేర్కొంది. ఇక మహారాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్డు విస్తరణ పనుల అప్పగింతలో కూడా పారదర్శకత పాటించలేదని, అనూయాకులకే పనులు అప్పగించడం ద్వారా రూ. 46.14 లక్షల మేర నష్టం కలుగజేసిందని పేర్కొంది.
ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) కూడా ముంబై పట్టణ మౌలిక వసతుల కల్పన పేరుతో చేపట్టిన ప్రాజెక్టు విషయంలో కూడా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, అంచనావ్యయాన్ని భారీగా పెంచడం ద్వారా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిళ్లిందని కాగ్ పేర్కొంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో జవాబుదారీతనం లోపించిందని కాగ్ పేర్కొంది. అయితే అసెంబ్లీ సమావేశాల చివరిరోజు నివేదిక అందజేయడంతో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం దొరకకుండా పోయింది.