Prisoners protests
-
పరప్పన అగ్రహారం జైలులో...
బొమ్మనహళ్లి(కర్ణాటక): బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మంగళవారం ఖైదీలు ఒక్కసారిగా ధర్నాకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని, నాణ్యమైన ఆహారం అందటం లేదని ఖైదీలు ఆందోళన చేపట్టారు. దీంతో జైలు అధికారులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. తమను పెరోల్‌పై పంపటం లేదని, జైలులో తయారు చేస్తున్న ఆహారంలో నాణ్యత లేదని, బయట నుంచి కూడా ఆహారం తీసుకు వచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తున్నారు. ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలు విరుద్దంగా అనేక వసతులు కల్పిస్తున్నారనే వదంతులు రావడంతో జైలులో ఆంక్షలు ఎక్కువయ్యాయని, కనీసం కుటుంబ సభ్యులను చూడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని వారు వాపోతున్నట్టు సమాచారం. మంగళవారం జైలుకు మానవ హక్కుల కమిషన్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఖైదీలు ధర్నాకు దిగినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఖైదీలు ఆందోళన అధికారులకు చెమటలు పట్టించింది. -
జిల్లా జైలులో ఖైదీల నిరశన
సాక్షి, నిజామాబాద్: తమకు పది నెలలుగా పని కల్పించడం లేదంటూ పలువురు ఖైదీలు బుధవారం నిజామాబాద్ జిల్లా జైలులో నిరశనకు దిగారు. భోజనం చేయకుండా గాంధీగిరీ చే పట్టారు. జైలు అధికారులు సముదాయించడంతో మధ్యాహ్నం తరువాత దీక్షను విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులో ఉన్న చర్లపల్లి జైలులో రద్దీ ఎక్కువ కావడంతో ప్రభుత్వం 2013 ఫిబ్రవరిలో సుమారు 120 మంది జీవిత ఖైదీలను జిల్లా జైలుకు తరలించింది. ఇక్కడి వర్క్‌షాప్ ప్రారంభానికి నోచు కోక పోవడంతో వీరికి పనులు లేకుండా పోయాయి. చర్లపల్లి లో ఉన్నప్పుడు అక్కడి వర్క్‌షాప్‌లో పని చేసేవారు. నెల నెలా సుమారు మూడు వేల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తమ కుటుంబాలు బతుకేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. జైలులో ఏర్పాటు చేసిన స్టీల్ ఫ్యాక్టరీ వర్క్‌షాప్ ప్రారంభానికి జైళ్ల శాఖ నిధులు మంజూరు చేయలేదు. దీంతో చర్లపల్లి నుంచి వచ్చిన జీవిత ఖైదీలకు పనులు కల్పించలేకపోయారు. దీంతో వారు తమను తిరిగి చర్లప ల్లికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిరశనకు దిగారు. వైద్య పరీక్షలూ లేవు తమకు వైద్య పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఖైదీలు పేర్కొంటున్నారు. మూడు నెలల క్రితం ఈ జైలు లో ఇద్దరు జీవితఖైదీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైలు సిబ్బంది తమను అసభ్య పదజాలంతో సంభాషిస్తున్నారని కొందరు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ములాఖత్ కోసం వస్తున్న తమను కూడా జైలు సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖైదీ ల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఖైదీలు తరచూ నిరసనలకు దిగినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. అధికారులేమంటున్నారంటే జీవిత ఖైదీల నిరసనలపై ‘సాక్షి’ జైలు సూపరిండెంట్ శంకరయ్యను సంప్రదించగా..అలాంటిదేమీలేదన్నారు. పెరోల్ తిరస్కరణకు గురికావడంతో గంగారాం అనే ఒక్క ఖైదీ మాత్రమే నిరసన తెలిపారన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో వర్క్‌షాప్‌ను ప్రారంభించలేకపోతున్నామన్నారు. వర్క్‌షాప్‌లో అన్ని యంత్రాలను బిగించామని, ఇన్స్ట్రక్టర్ నియామకం జరగాల్సి ఉందని పేర్కొన్నారు.