‘ప్రైవసీ’ప్రాథమిక హక్కు కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: ‘వ్యక్తిగత రహస్యం(ప్రైవసీ)’ అనేది ప్రాథమిక హక్కు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో అది లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు దాన్ని కారణంగా చూపలేమని వివరించింది. ఆధార్ అమలుకు లోపరహిత వ్యవస్థను రూపొందించామని పేర్కొంది.
ఆర్టికల్ 32 కింద దాఖలైన సంబంధిత పిటిషన్లను కొట్టేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. వ్యక్తిగత రహస్య హక్కుకు పరిమితులున్నాయని, అది పరిపూర్ణ హక్కు కాదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపించాలనుకుంటున్నామని న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు.