ప్రైవేటు విమానంలో 3.5 కోట్ల పాతనోట్ల తరలింపు!
హర్యానాలోని హిస్సార్ నుంచి నాగాలండ్‌లోని డిమాపూర్‌కు రూ. 3.5 కోట్లను ఒక ప్రైవేటు విమానంలో తరలిస్తుండగా ఆ విమానాన్ని దించేసి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు విమానాలు ఎగరాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన సెక్యూరిటీ ప్రోగ్రాంను ఈ విమానం నడిపిస్తున్న ఎయిర్‌కార్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దుచేసింది. హిస్సార్‌లో తాము బ్యాగులు చెక్ చేశామని, అందులో కేంద్రం రద్దుచేసిన 500, 1000 నోట్లు ఉన్నాయన్న విషయాన్ని ఏటీసీకి పైలట్లు తప్పనిసరిగా చెప్పాలి. అయితే, పైలట్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అందువల్ల ఏటీసీకి ఆ విషయం చెప్పలేదని ఎయిర్‌కార్ చెబుతోంది.
ఎయిర్‌కార్ సంస్థకు మూడు విమానాలున్నాయి. వాటిలో ఒకదాన్ని హిస్సార్‌లో సెక్యూరిటీ చెకింగులు ఏమాత్రం లేని ఒక చిన్న ఎయిర్‌ఫీల్డ్ నుంచి తీసుకుని నవంబర్ 22న డిమాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. తాను ఈ మొత్తానికి పన్ను కట్టానని, కొంత మినహాయింపు ఉందని చెప్పిన ప్రయాణికుడు.. అందుకు ఆధారంగా కొన్ని పత్రాలను కూడా చూపించాడని, అందుకే తమ పైలట్లు పెద్దగా పట్టించుకోలేదని ఎయిర్ కార్ అధినేత మానవ్ సింగ్ చెప్పారు.
పెద్దనోట్లను రద్దు చేయకముందు కూడా చాలామంది పెద్దమొత్తాలను దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాగే పెద్దగా సెక్యూరిటీ చెకింగులు ఏవీ లేని చిన్న చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి ప్రైవేటు విమానాలు తీసుకుని వెళ్లేవారు. దాంతో.. ఇలాంటి చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి బయల్దేరే ముందు తప్పనిసరిగా పోలీసుల పర్యవేక్షణలో ప్రయాణికుల బ్యాగేజి చెక్ చేయాలని డీజీసీఏ స్పష్టం చేసింది. అయినా అక్కడక్కడ మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.