తప్పుడు సంకేతాలకు ఆస్కారం..!
న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపదా? నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన సలహాదారులైనా చెప్పాలిగా.. తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉంద’ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ కార్యక్రమాన్ని ఇలా బహిరంగపర్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగేందుకు అవకాశం కలి్పంచకూడదని సూచించారు. సీజేఐ ఇంట్లో పూజలో మోదీ పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ వెల్లడించారు. గత 50 ఏళ్లుగా తాను సుప్రీంకోర్టులో పని చేస్తున్నానని, ఎంతోమంది గొప్పగొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని, అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, బయటపెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేలి్చచెప్పారు. తాజా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తుచేశారు. ఈ విభజన రేఖ విషయంలో సీజేఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఆ పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి: సంజయ్ రౌత్ సీజేఐ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజ పట్ల శివసేన(ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతంజస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేకూర్చగలరా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: సుప్రియా సూలే జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. వయసులో, అనుభవంలో ప్రధాని మోదీ, జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని, వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు. అయితే, సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు. నీచ రాజకీయాలు చేయొద్దు: సంబిత్ పాత్రా సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచి్చన విందుకు అప్పటి సీజేఐ వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తంచేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే ఇక్కడి రాజకీయ పారీ్టలేవీ స్పందించడం లేదని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు.