మహారాష్ట్ర, యూపీలో ఘోర ప్రమాదాలు
⇒ ప్రైవేట్ బస్సు బోల్తా పడి 9 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంభోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనోరా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పుణే నుంచి లాథూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు ధనోరా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డవారిని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
యూపీలోనూ తీవ్ర విషాదం
ఉత్తరప్రదేశ్ లోని మథురలోనూ ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. దైవ దర్శనానికి కొందరు కారులో ప్రయాణం కాగా, మథురలోని మకేరా సమీపంలో కెనాల్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పింది. దీంతో నదిలోకి ఆ కారు దూసుకెళ్లడంతో 10 మంది మృతిచెందారు. ఆదివారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా బరేలీకి చెందిన వారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.