Priyadarshini Jurala project
-
జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే
గద్వాల రూరల్: రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల జలాశయానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు త్వరలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించనున్నారు. త్వరలోనే ముంబైకి చెందిన నిపుణులు బృందం జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయనున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారి ఆదివారం మీడియాకు వివరించారు. 2009లో వచి్చన భారీ వరదల అనంతరం 2012లో జూరాల జలాశయంలోని నీరు, బురదను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసింది. ఈ సర్వేలో జలాశయం సామర్థ్యం 11.94 టీంఎసీల నుంచి 9.657 టీఎంసీలకు పడిపోయినట్లు సుమారు మూడున్నర టీఎంసీల మేర బురద పేరుకు పోయినట్లు లెక్క తేల్చారు. దీంతో జూరాల కింద 1.20 లక్షల ఆయకట్టు కాస్త 1.07 లక్షలకు కుదించారు. తాజాగా తెలుగు రాష్ట్రాలోని కృష్ణానదిపై ఉన్న జలాశయాల నిర్వహణను కృష్ణాబోర్డు అ«దీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో మరోమారు జలాశయం నీటినిల్వ సామర్థ్యం, ఎంత మేర పూడిక (బురద) పేరుకుపోయిందో లెక్కవేయనున్నారు. -
‘జూరాల’ వద్ద మరో కొత్త జలాశయం
గద్వాల రూరల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన మరో జలాశయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది వరకే గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, భూములు ఎక్కువగా ముంపునకు గురవకుండా తక్కువ భూ సేకరణతో జలాశయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇదే నివేదికను ప్రభుత్వం ఈఎన్సీ అధికారులకు అందజేసి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు గద్వాల జిల్లా ఇంజినీరింగ్ అధికారులను విచారణ చేసి నివేదిక అందించాలని సూచించడంతో 16 రోజుల క్రితం పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని జలాశయం నిర్మాణం చేపడితే ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంది. జూరాల వెనకజలాలకు.. జూరాల వెనక జలాలకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ద్యాగదొడ్డి, నాగర్‌దొడ్డి ప్రాంతాల నడుమ అదనపు జలాశయాన్ని నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. 3,600ఎకరాల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో జలాశయ నిర్మాణాన్ని చేపట్టనుండగా కట్ట పొడవు 15 కిలోమీటర్లు ఉంటుంది. జూరాల కుడి కాల్వ పరిధిలోని 37వేల ఎకరాలతో పాటు నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు కలుపుకొని 2.70 లక్షల ఎకరాలకు, జూరాల ఎడమ కాల్వ పరిధిలోని 63 వేల ఎకరాలతోపాటు భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో కలుపుకొని మూడు లక్షల ఎకరాలకు సాగునీటి ని అందించవచ్చని ఇరిగేషన్ అధికారులు లెక్క తేల్చారు. జలాశ యంలోకి నీటిని పంపింగ్ చేసేందుకు 40 మెగావాట్ల సామర్థ్యంతో 5 పంపులు అవసరమవుతాయి. ఇదే అంశాలను పేర్కొంటూ తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి వస్తే కార్యాచరణ రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికలో చాలా అనుకూల అంశాలున్నాయి. జూరాల జలాశయం పక్కన 20 టీఎంసీల సామర్థ్యంతో అదనపు జలాశయ నిర్మాణానికి సంబంధించి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే కార్యాచరణ మొదలవుతుంది. గద్వాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ సాగునీటి కష్టాలు తీరుతాయి.– రహీముద్దీన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన గద్వాల జిల్లాలోని గట్టు, ధరూరు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు 2018, జూన్ 29న గట్టు మండలం పెంచికలపాడు సమీపంలో ఎత్తిపోతలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.570 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతలకు నల్లసోమనాద్రి ఎత్తిపోతలు అని నామకరణం చేశారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇది మధ్యలోనే నిలిచిపోయింది. ఇదే క్రమంలో 20టీఎంసీల సామర్థ్యంతో జూరాలకు పక్కనే అదనంగా మరో జలాశయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లా ఇరిగేషన్ ఆమోదం.. రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికపై జిల్లా ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా జలాశయ నిర్మాణానికి 3,600 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అయితే ఈ కొత్త జలాశయంలో గ్రామాలు, వ్యవసాయ పొలాలు ముంపునకు గురికావని, అంతేకాకుండా కొత్త కాల్వల నిర్మాణాలు కూడా అవసరం లేదని గుర్తించారు. -
జూరాల నాలుగు గేట్ల ఎత్తివేత
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో పెరగడంతో సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదకుతోడు నారాయణపూర్నుంచి ఇన్‌ఫ్లో కలిపి 50వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టులో నాలుగు క్రస్టుగేట్లను ఎత్తి 8320 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదే విధంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 48వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్ల ద్వారా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. -
జూరాలలో విద్యుదుత్పత్తి ప్రారంభం
మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్టులోని నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని గురువారం ప్రారంభించారు. జలాశయానికి ఇన్‌ఫ్లో బాగా ఉండడంతో బుధవారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించగా గురువారం తెల్లవారుజాము నుంచి నాలుగో యూనిట్లో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. జూరాలకు ఇన్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులు ఉండగా విద్యుదుత్పత్తి కారణంగా 32 వేల క్యూసెక్కల నీటిని ఔట్‌ఫ్లోగా కిందికి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7,855 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలాశయ అధికారులు వెల్లడించారు. -
జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
- 47071 క్యూసెక్కులు దిగువకు విడుదల - ఆరు యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుం చి వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు కొనసాగుతున్నట్లు పీజేపీ అ ధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 36488 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లకు విద్యుదుత్పత్తి నిమిత్తం 46071 క్యూసెక్కులు, ఆయకట్టు రైతులకు సాగునీటి నిమిత్తం కుడి, ఎడమ కాలువల ద్వారా వేయి క్యూసెక్కులను మొత్తం ప్రాజెక్టు నుంచి 47071 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఆదివారం రాత్రి 7.30గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 1043 అడుగులుగా ఉంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 52029 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 11 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 69670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 47400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 66500 క్యూసెక్కుల నీటిని దిగువకు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
గ్రేటర్‌కు జూరాల జలాలు
-
గ్రేటర్‌కు జూరాల జలాలు
►కొత్త ప్రాజెక్టుకు జలమండలి శ్రీకారం ►సిద్ధమైన పథకం ఫైలు.. సీఎం ఆమోదమే తరువాయి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తరలించి శివారు ప్రాంత దాహార్తిని తీర్చేందుకు జలమండలి మరో బృహత్తర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. సుమారు 123 కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఈ పథకం ద్వారా నగరానికి రోజువారీగా 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్నది లక్ష్యం. ఈ పథకానికి సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. ఆయన ఆమోదముద్ర పడడమే తరువాయి. కృష్ణా మూడోదశ.. గోదావరి మంచినీటి పథకాలతో పాటు ఇది నగరానికి ప్రత్యేక పథకం కానుంది. జూరాల-హైదరాబాద్ పథకం తీరిదీ.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. జూరాల నుంచి రామన్‌పాడు జలాశయానికి 0.388 టీఎంసీల నీటిని తరలించి అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా చేయాలన్నది జలమండలి లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద 123 కిలోమీటర్ల మేర 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో పంపింగ్ మెయిన్ 96 కిలోమీటర్లు, గ్రావిటీ మెయిన్ 27 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పథకం పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టాలని జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్యాకేజీల వారీగా పనుల వివరాలివీ.. ప్యాకేజీ-1: 35 కిలోమీటర్లు. రామన్‌పాడు నుంచి మూసాపేట్ వరకు 85 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-2: 27 కిలోమీటర్లు. మూసాపేట్ నుం చి జడ్చర్ల-150 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-3: 34 కిలోమీటర్లు. జడ్చర్ల నుంచి షాద్‌నగర్-90 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజి-4: 27 కిలోమీటర్లు. షాద్‌నగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓఆర్ఆర్ జంక్షన్ వరకు గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నీటి తరలింపు అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు.. రింగ్ మెయిన్1: జూరాల నుంచి తరలించిన నీటిని గ్రేటర్ నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు ఓఆర్ఆర్ జంక్షన్- లింగంపల్లి వరకు మంజీరా సరఫరా నెట్వర్క్ పరిధిలోకి 30 కి.మీ. మేర నీటిని తరలించాల్సి ఉంటుంది. రింగ్ మెయిన్ 2: ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఉప్పల్, సైనిక్‌పురి మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు సుమారు 60 కి.మీ. మేర పైప్‌లైన్‌ను నిర్మించి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. జంట జలాశయాలకూ జల కళ.. జూరాల నీటిని షాద్‌నగర్ మీదుగా లక్ష్మీదేవిపల్లి నుంచి గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ఆధారంగా ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఆరాంఘర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్ సాగర్లకు తరలించాలని ప్రతిపాదించారు. దీంతో జంట జలాశయాలు అన్ని కాలాల్లోనూ జలకళతో నిండుగా ఉండడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. టాటా కన్సల్టెన్సీకి ప్రతిపాదనల బాధ్యత జూరాల- హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టుపై సమగ్ర ప్రతిపాదనలు, డిజైన్ సిద్ధం చేసే బాధ్యతలను జలమండలి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు అప్పగించనుంది. ఈ సంస్థ గతంలో కృష్ణా మొదటి, రెండు, మూడో దశ పథకాలకు డిజైన్లు, సమగ్ర ప్రాజెక్టు అంచనాలు సిద్ధం చేసిన విషయం విదితమే. -
జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
ధరూరు: ఎగువ రాష్ట్రాల్లో కు రుస్తున్న భారీ వర్షాలతో ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లోలు క్రమక్రమంగా పెరుగుతున్నాయన్నారు. రాత్రి 7.30గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 13 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తుకు, నాలుగు క్రస్టుగేట్లను అరమీటరు ఎత్తుకు మొత్తం 17 క్రస్టుగేట్ల ద్వారా 97014 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు నీటిమట్టం 1044 అడుగులుగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1612 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 39వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 51000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 15000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులువివరించారు. ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి... జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని మొత్తం ఆరు యూనిట్లకుగాను ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనట్లు జెన్కో అధికారులు పేర్కొన్నారు. 1,2,3,5,6 యూనిట్ల ద్వారా మొత్తం 175 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని వారు వెల్లడించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద సుంకేసుల బ్యారేజీ వద్ద సోమవారం కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన వున్న తుంగభద్ర డ్యాం నుండి విడుదలవుతున్న నీటితోపాటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఉదయం 1.20 లక్షల క్యూసెక్కులకు చేరిన వరదనీటితో డ్యాం వద్ద ఏర్పాటుచేసిన 28 గేట్లు మీటరు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం వరద ప్రవాహం 90 వేల క్యూసెక్కులకు చేరడంతో 24 గేట్లు మీటరు మేర ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపాడు. తుంగభద్ర డ్యాంనుండి 31 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరుతుందని, బ్యారేజీలో 1 టిఎంసి నీటిని నిల్వ ఉంచుతూ మిగతా నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కేసీ కెనాల్‌కు 2500 క్యూసెక్కులు యధావిధిగా విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.