రేపటి నుంచి ఆమరణ దీక్ష
- ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా ప్రారంభం
- పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చించేందుకే
- మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ వెల్లడి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రైతు ఆత్మహత్యలు సాగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్-మంతర్‌లో సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారమిక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవేగౌడ మాట్లాడారు. కర్ణాటకతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరి సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటులో అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని తాను ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాశానని, అయితే ఈ అంశంపై స్పీకర్ నుంచి ఎలాంటి సమాధానం లభించలేదన్నారు. అందుకే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చకు అనుమతించే వరకు నిరాహార దీక్షను విరమించబోనని దేవేగౌడ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంతోనే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోందని, ఇక పాలనా విషయంలో పూర్తిగా విఫలమైన బీజేపీ పార్లమెంటు సమావేశాలు కొనసాగకపోవడమే మంచిదన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇలాంటి సందర్భంలో రైతుల సమస్యలపై అర్ధవంతమైన చర్చ సాగేందుకు పార్లమెంటులో అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారని, ఇలాంటి పార్టీలన్నింటికి త్వరలోనే ప్రజలు సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.