Protocol dispute
-
ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రొటోకాల్ వివాదం.. అసలేం జరిగింది!
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రొటోకాల్ వివాదం ముదురుతోంది. మేడారం జాతరలో గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్ మేడారం వెళ్తారని, హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు. అయితే అదేరోజు కాస్త ముందుగా సీఎం కేసీఆర్ జాతరకు వెళ్తున్నారని, ప్రభుత్వం వద్ద ఉన్నది ఒక హెలికాప్టర్ మాత్రమేనని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సీఎం హెలికాప్టర్లో మేడా రం వెళ్తారనే సమాచారం ముందుగానే ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్ కార్యాలయం హెలికాప్టర్ కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. చివరికి గవర్నర్ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లిన విషయం తెలిసిందే. గవర్నర్ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం, కోవిడ్ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య విభేదాలు పొడచూపాయి. ఢిల్లీకి గవర్నర్ ప్రొటోకాల్ వివాదం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించిన అంశం ఢిల్లీకి చేరింది. మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున(19న) దర్శనానికి గవర్నర్ ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. గవర్నర్ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్ మీట్’నిర్వహించారు. తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే సీతక్క వేర్వేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంలో గవ ర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఎంపీపీ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్.. ఆ మాత్రం తెలియదా..
సాక్షి, ఇల్లందకుంట(కరీనంగర్): ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చదవండి: ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’ -
వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై టీడీపీ నేతల దౌర్జన్యం
ప్రొటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాదు అగౌరవంగా వ్యవహరించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం మేదినరావుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. నీరు చెట్టు పథకంలో భాగంగా గ్రామంలో ఆగిరిగుంట చెరువు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొటోకాల్ ప్రకారం ఈ విషయం గ్రామ సర్పంచ్‌కు తెలుపాలి. కానీ తనకు తెలియజేయకపోవడంతో సర్పంచ్ ఎ.సీతారావమ్మ భర్త ఎ.వెంకటేశ్వరరావుతో కలసి వెళ్లి ఇరిగేషన్ ఏఈ గనిరాజు, జన్మభూమి కమిటీ సభ్యులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న తెలుగు తమ్మళ్లు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త సురేష్ సర్పంచ్ సీతారావమ్మతోపాటు ఆమె భర్తను తోసివేయడంతో వారు కింద పడిపోయారు. జన్మభూమి కమిటీ సభ్యులు వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై సర్పంచ్ సీతారావమ్మ దెందులూరు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపారు.