ప్రొటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాదు అగౌరవంగా వ్యవహరించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం మేదినరావుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
నీరు చెట్టు పథకంలో భాగంగా గ్రామంలో ఆగిరిగుంట చెరువు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొటోకాల్ ప్రకారం ఈ విషయం గ్రామ సర్పంచ్‌కు తెలుపాలి. కానీ తనకు తెలియజేయకపోవడంతో సర్పంచ్ ఎ.సీతారావమ్మ భర్త ఎ.వెంకటేశ్వరరావుతో కలసి వెళ్లి ఇరిగేషన్ ఏఈ గనిరాజు, జన్మభూమి కమిటీ సభ్యులను ప్రశ్నించారు.
దీంతో అక్కడే ఉన్న తెలుగు తమ్మళ్లు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త సురేష్ సర్పంచ్ సీతారావమ్మతోపాటు ఆమె భర్తను తోసివేయడంతో వారు కింద పడిపోయారు. జన్మభూమి కమిటీ సభ్యులు వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై సర్పంచ్ సీతారావమ్మ దెందులూరు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపారు.