PSPB
-
ఫైనల్లో రుత్విక
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రుత్విక శివాని 16–21, 21–14, 21–12తో తెలంగాణకే చెందిన సామియా ఇమాద్ ఫారూఖిపై విజ యం సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాల బారిన పడిన రుతి్వక ఇటీవలే కోలుకొని మళ్లీ రాకెట్ పట్టింది. ఈ టోర్నీ క్వాలిఫయింగ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో రుత్విక తలపడుతుంది. -
సాత్విక్ ‘డబుల్’
సింగిల్స్ చాంప్స్ రితూపర్ణ, సౌరభ్ వర్మ పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో డబుల్స్ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రెండు టైటిల్స్‌ను సాధించగా... తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు (పీఎస్‌పీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ ఆటగాడు సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో రెండోసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వయం 21–17, 16–21, 21–14తో నందగోపాల్ (కాగ్)–సాన్యమ్ శుక్లా (ఎయిరిండియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ కె. మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో 21–14, 21–18తో వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ అమ్మాయి, రెండో సీడ్ రితూపర్ణ దాస్ 21–12, 21–14తో తొమ్మిదో సీడ్ రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచి తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2011 చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 21–12తో ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు. -
జాతీయ బ్యాడ్మింటన్ విజేత పీఎస్‌పీబీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) హవా కొనసాగింది. ఇక్కడ జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను పీఎస్‌పీబీ మళ్లీ గెలుచుకుంది. పెట్రోలియం జట్టు జాతీయ విజేతగా నిలవడం ఇది వరుసగా 15వ సారి కావడం విశేషం. గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో పీఎస్‌పీబీ జట్టు 3-1 తేడాతో ఎయిరిండియాపై విజయం సాధించింది. సౌరభ్‌వర్మ, శ్రీకాంత్, గురుసాయిదత్ సింగిల్స్‌లో గెలిచి జట్టుకు టైటిల్ అందించారు. మహిళల విభాగంలో పీఎస్‌పీబీ జట్టు 2-0తో ఎయిరిండియాను చిత్తు చేసింది. సింగిల్స్‌లో పీవీ సింధు, డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడీ విజయాలు సాధించారు.