ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను పారిశ్రామిక రంగంలో సృష్టించాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో కూడా స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (ఇండస్ట్రియల్ పాలసీ) సీఎం సిద్ధరామయ్య శుక్రవారం సాయంత్రం విధాన సౌధాలోని బాంక్వెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నూతనంగా రూపొందించిన పాలసీ ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు (2014-2019 వరకూ) అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రూ. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 15 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పాలసీను అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్ధతిలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసే విధానాన్ని మొదటి సారిగా ఇదే పాలసీలో పొందుపరిచామన్నారు.
ప్రతి ఏడాది ఒక్కొక్కటి 5,000 నుంచి 8,000 ఎకరాల విస్తీర్ణంలో కనిష్టంగా ఐదు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా పరిశ్రమల స్థాపన మైనింగ్ రంగంతో ముడిపడి ఉంటుందన్నారు. అందువల్ల నూతన మైనింగ్ పాలసీను రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో ఏరోస్పేస్, మిషన్టూల్, స్టీల్, సీమెంట్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
అతిచిన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని కూడా రెట్టింపు చేశామన్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన తరగతులు, మహిళలు, వికలాంగులకు, విశ్రాంత సైనికులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఎక్కువ సబ్సిడీలు కల్పించనున్నామన్నారు.
అదేవిధంగా పరిశ్రామిక వాడకు కేటాయించిన మొత్తం భూమి విస్తీర్ణంలో 22.5 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి తప్పక కేటాయించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించమని తెలిపారు. అదే విధంగా నూతన పాలసీ వ్యవధి లోపు రెండు పారిశ్రామిక వాడలను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పారిశ్రామిక వాడ విస్తీర్ణంలో ఐదు శాతాన్ని వారికి తప్పక కేటాయిస్తామని సిద్ధరామయ్య వివరించారు.