Pullur
-
ఆదిమానవుల్లోనే ఇదో కొత్త తెగ
పుల్లూర్కు చరిత్రలో స్థానం: ఏపీ పురావస్తు శాఖ డెరైక్టర్ రామకృష్ణారావు సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్‌లో పురావస్తుశాఖ చేపట్టిన బృహత్ శిలాయుగపు సమాధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీ పురావస్తు శాఖ డెరైక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఈ సమాధులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో తానే పుల్లూర్‌లో పరిశోధన చేసి, కేంద్రం అనుమతి కోసం నివేదిక పంపించినట్లు చెప్పారు. ప్రస్తుతం తవ్వకాలను చూస్తుంటే ఆదిమానవుల్లోనే కొత్త తెగకు చెందిన వారు ఈ ప్రాంతంలో 300 ఏళ్లు ఇక్కడ ఉన్నట్టు భావించవచ్చన్నారు. ఈ తవ్వకాలతో పుల్లూర్ గ్రామానికి చరిత్రలో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. సాధారణంగా సమాధులు ఎనిమిది రకాలుగా ఉంటాయన్నారు. ఇక్కడ డార్మినాయిడ్, వర్తలాకర్, సిస్ట్ సమాధులున్నట్లు పేర్కొన్నారు. ఈ తవ్వకాల్లో లభించిన మట్టి పాత్రలు, పరికరాలు, వేటాడే వస్తువుల ఆధారంగా వీటిని 3వేల సంవత్సరాల క్రితం వినియోగించినట్లు చెప్పవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా.. పుల్లూర్‌లో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు రకాల సమాధులను తవ్వారు. మూడో రకం సమాధి తవ్వకాలను ప్రారంభించారు. పురావస్తుశాఖ సాంకేతిక సహాయకులు ప్రేమ్‌సాగర్, రిటైర్డ్ ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. -
బృహత్ శిలాయుగపు సమాధులు....
పుల్లూరులో పురావస్తుశాఖ తవ్వకాల్లో గుర్తింపు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్ శివారులో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో రోజురోజుకూ ఆసక్తికర వస్తువులు లభ్యమవుతున్నాయి. సోమవారం బృహత్ శిలాయుగపు సమాధులు 50 వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా బండలపై గ్రైడింగ్ గ్రూవ్స్ గుర్తించామని వీటిని నవీన శిలా యుగంలో 4,500 సంవత్సరాల క్రితం వాడి ఉంటారని చెబుతున్నారు. గ్రైడింగ్ గ్రూవ్స్ను రాతి గొడ్డళ్లను నూరేందుకు వాడతారని పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి.ప్రేమ్‌కుమార్ పేర్కొంటున్నారు. కాగా శిలాయుగపునాటి సమాధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరిన్ని రకాల వస్తువులు బయటపడే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. -సిద్దిపేట రూరల్ -
3 వేల ఏళ్లనాడే ఇనుము వినియోగం
పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మం డలం పుల్లూర్ శివారులో కొనసాగిస్తున్న తవ్వకాల్లో శనివారం పలు రకాల పనిముట్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపడుతున్న విషయం విదితమే. సూక్ష్మరాతి, ఉలి లాంటి పనిముట్లు, మృణ్మయ పాత్రలు వెలుగుచూశాయి. సూక్ష్మరాతి పనిముట్లతో పక్షులను, జంతువులను వేటాడటానికి, ఉలిని బండలను పగులగొట్టడానికి వినియోగించినట్లు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకుడు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తిలు పేర్కొంటున్నారు. బయట పడుతున్న పనిముట్ల ఆధారంగా చూస్తే.. 3వేల సంవత్సరాల నాడే ఇనుమును వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.