60 రోజులు నీరుతోడే పంపుసెట్లు ఎందుకు?
♦ ‘పాలమూరు’పై అసెంబ్లీలో ప్రశ్నించిన జానారెడ్డి
♦ ఒక టీఎంసీ నీటితో 13వేల ఎకరాలకు నీరెలా ఇస్తారు?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో నీటిలభ్యత 30 రోజులు ఉంటే, 60 రోజుల పాటు నీటిని తోడే పంప్సెట్లను ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై బుధ వారం ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత కన్నా ఎక్కువ సామర్థ్యంతో పంప్సెట్ల ఏర్పాటు వల్ల అనవసర సమస్యలు వస్తాయన్నారు. మరోవైపు నీటి లభ్యత మేరకు అనుమతులు ఇస్తామని కేంద్ర జల సంఘం చెబుతుండడాన్ని జానారెడ్డి ప్రస్తావించారు. ప్రాణహిత ద్వారా ఒక టీఎంసీ నీటిని 13,700 ఎకరాలకు ఏ విధంగా సరఫరా చేస్తారు.. అందుకు వినియోగించబోయే టెక్నాలజీని డీపీఆర్‌లో ఎందుకు పేర్కొనలేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా రబీ పంటకు 5లక్షల ఎకరాలకు నాలుగు నెలల పాటు నీరిస్తామంటున్న ప్రభుత్వం, 120 రోజులపాటు పొలాలకు నేరుగా నీరిస్తే రిజర్వా యర్లను ఎప్పుడు నింపుతారో చెప్పాలన్నారు.
భూసేకరణతోనే ప్రాజెక్ట్‌లు పూర్తికావు: హరీశ్‌రావు
కేవలం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌లు పూర్తి అయినట్లు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూసేకరణతో పాటు సాంకేతిక, డిజైన్, రైల్వే, అటవీ.. తదితర అనుమతులు కూడా అవసరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్‌లకు అవసరమైన దాంట్లో అది 50శాతమే సేకరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం మేరకు దేశంలో ఎక్కడా ప్రాజెక్ట్‌లు నిర్మాణం కాలేదన్నారు. రాష్ట్ర అవసరాల మేరకే ప్రాజెక్ట్‌లకు భూమిని సేకరిస్తామని, గతంలో సేకరించి.. ఆయా ప్రాజెక్ట్‌లకు వినియోగించని భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు.