రెండువేలు ఇచ్చి.. ఆ ‘ఆపరేషన్’ చేశారు!
అలీగఢ్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో డబ్బులేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి కేవలం రూ. రెండువేల కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ‘నాకు ఉద్యోగం లేదు. డబ్బు అవసరం చాలా ఉంది. పురుషులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే రూ. 2000 ఇస్తున్నారని విన్నాను. అందుకే నేను కూడా ఆ ఆపరేషన్ చేయించుకున్నాను’ అని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పురాణ్శర్మ తెలిపారు.
అయితే, డబ్బులు ఇచ్చి బలవంతంగా పురుషులకు కు.ని. ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ వివాదం చెలరేగడంతో దీనిపై అలీగఢ్ ముఖ్య వైద్యాధికారి స్పందించారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం భార్యను తీసుకొని పురాణ్ శర్మ వచ్చాడని, అయితే, ఆయన భార్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఆపరేషన్ చేయడం కుదరలేదని, కాబట్టి ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్ పథకంలో భాగంగా పురాణ్ శర్మను ఒప్పించి ఆపరేషన్ చేశామని తెలిపారు.